
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టేడియంలోకి ప్రవేశించే సమయంలో ఓ ప్రేక్షకుడు మరియు విధుల్లో ఉన్న లేడీ బౌన్సర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఇరువురు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు దారి తీసింది.పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన గౌతమ్ అనే ప్రేక్షకుడు గేట్ నంబర్–ఇ1 వద్ద స్టేడియంలోకి ప్రవేశించే సమయంలో క్యూలైన్‌ను పాటించకుండా పక్కదారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న లేడీ బౌన్సర్ అజీరా పర్వీన్ అతడిని నిలిపివేసి క్యూలో రావాలని సూచించింది.దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ గౌతమ్ ఘటనను మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించగా, లేడీ బౌన్సర్ అతని చేతిలోని ఫోన్‌ను లాక్కొని బయటకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం కొంతసేపటికి తిరిగి ఫోన్‌ను అతనికి అప్పగించినట్లు తెలిసింది.ఈ ఘటనపై ప్రేక్షకుడు గౌతమ్ తనపై దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేయగా లేడీ బౌన్సర్ కూడా విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనను తిట్టి అవమానించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన ఉప్పల్ పోలీసులు పరస్పర కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సమత తెలిపారు. మ్యాచ్ సందర్భంగా భారీగా అభిమానులు తరలివచ్చిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినప్పటికీ ఈ ఘటన అక్కడ కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం.