
అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... వడ్లమాను గ్రామంలో సులోమన్ రాజు, దుర్గామణి అనే దంపతులు నివసిస్తున్నారు. విజయవాడలోని ఓ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా రాజు పని చేస్తున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో పని చేసే వెంకన్నబాబుతో దుర్గామణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తన ప్రియుడితో భర్తను తొలగించుకోవాలని చెప్పింది. వెంకన్నబాబు తన సోదరుడుకు తెలిసిన సాయిశ్రీనివాస్, జశ్వంత్ రాయ్‌తో సులోమన్‌ను హత్య చేయడానికి రూ.12 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారు. తన ఇంటి నిర్మాణానికి రుణం కావాలని సులోమన్‌కు సాయి శ్రీనివాస్, జశ్వంత్ రాయ్ ఫోన్ చేశారు. గొల్లగూడె వద్ద కు కారులో ఎక్కించుకొని బయలుదేరారు. నూజీవీడు సమీపంలో కారులో ముగ్గురు కలిసి మద్యం తాగారు. సులోమన్‌కు పీకలదాకా మద్యం తాగించి అనంతరం గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహం వద్దకు చేరుకొని సులోమన్ రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వెంకన్నబాబు, దుర్గామణి, సాయిశ్రీనివాస్, మణికంఠ నలుగురు నిందితులని తెలిసింది. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.