← Back to headlines

పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్

2026-05-07 22:00 • original

మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా... పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా... భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 2047 నాటికి దేశ జిడిపిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల అర్బన్ కొలాప్స్ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదని అన్నారు. అందుకే..భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామని,

ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వివరించారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా... బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్‌ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జిసిసిల ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని చెప్పారు. గతేడాది 70కి పైగా జిసిసిలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జిసిసిలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిసిసిలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా..వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.