
ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి పుంజుకుంటోంది. ఆరంభంలో విజయాలు అందుకోవడంలో తడబడినా.. ప్రస్తుతం మంచి ప్రదర్శనతో విజయాలు అందుకుంటోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎనిమది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ వివాదం చోటు చేసుకుంది. ఢిల్లీ ఆటగాడు నితీశ్ రాణా ఔట్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే.. నితీశ్ రాణా ఒకే బంతికి ‘క్యాచ్ ఔట్’తో పాటు ‘‘హిట్ వికెట్’గా ఔట్ అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 10వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన బంతిని రాణా డీప్ ఫైన్‌లెగ్ మీదుగా నితీశ్ కొట్టాడు. ఆ బంతిని అక్కడ కార్తీక్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. అదే సమయంలో వికెట్లపై నుంచి బెయిల్స్ ఎగిరి కిందపడి లైట్లు వెలిగాయి. దీంతో అది హిట్ వికెట్‌గా భావించారు.
అయితే నిజానికి నితీశ్ కానీ, కీపర్ సంజూ శాంసన్ కానీ వికెట్లను తాకలేదు. బాగా గాలి వీచడం వల్ల అలా జరిగింది. అయితే అలా బెయిల్స్ కిందపడితే డెడ్‌బాల్‌గా ప్రకటించాలి కాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఐసిసి నిబంధనల ప్రకారం.. బంతి ని బౌలర్ విసిన తర్వాత బెయిల్స్ పడితే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించరు. అందుకే ఈ బంతిని లీగల్ డెలివరీగా ప్రకటించినట్లు తెలుస్తోంది.