← Back to headlines

మార్పు కోరిన యువతరం

2026-05-08 05:16 • original

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టివికె) అనూహ్యంగా అఖండ విజయం సాధించడం 1977 నుంచి రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రెండు ద్రవిడ దిగ్గజాల పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకె భవిష్యత్‌పై ఆలోచింపచేస్తోంది. 134 నియోజకవర్గాల్లో టివికె, డిఎంకె, ఎఐఎడిఎంకె ఓట్ల శాతాలను విశ్లేషిస్తే ఈ పార్టీలన్నీ ఒకదానికొకటి ఢీకొనినప్పటికీ ఎఐఎడిఎంకె అస్తిత్వానికి ముప్పు ఎదురైనట్టు స్పష్టమవుతోంది. ఎఐఎడిఎంకె ఓటు బ్యాంకుకు టివికె భారీగా గండి కొట్టింది. ఈ త్రిముఖ పోటీలో డిఎంకె తన ఓటుబ్యాంకును భారీగా నిలబెట్టుకోగలగడం విశేషం. అధికారంలో ఉన్న డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తన స్వంత కొలత్తూరు నియోజకవర్గం నుంచి మాజీ డిఎంకె నాయకుడు, టివికె అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పొందిన సిట్టింగ్ ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కుతారు. ఓటర్ల మొగ్గు ఈ విధంగా మార్పు చెందడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ఇది ఒక్క కొలత్తూరు నియోజకవర్గానికే పరిమితం కాలేదు. మొత్తం 134 నియోజకవర్గాల్లోనూ కనిపించింది. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించి డిఎంకె మద్దతు ఇచ్చిన వారు కూడా టివికె వైపు మొగ్గుచూపారు. ప్రముఖ సినీ నటుడు, టివికె అధినేత విజయ్ అఖండ విజయం రాజకీయ నాయకులకు, పార్టీలకు ఒక హెచ్చరిక. ఇప్పటికైనా పాత పద్ధతులు విడిచిపెట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారకపోతే మొత్తం పార్టీ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుందని గట్టిగా మేల్కొలిపే ఒక హెచ్చరిక. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు నటుడు విజయ్‌పై కనిపించే ప్రజాభిమానాన్ని తేలికగా తీసుకున్నారు. కొన్ని వేల మంది విజయ్ ప్రచార సభకు తరలివచ్చి గంటల కొలది నిరీక్షించినా అవన్నీ ఓట్లరూపం దాల్చవన్న ఆలోచనలోనే ఉన్నారు.

మరోవైపు డిఎంకె, ఎఐఎడిఎంకె పార్టీలు కూడా ఇదో ధోరణిలో ఆలోచించాయి. కానీ విజయపై వెల్లువెత్తిన అభిమానం తమిళనాట తరతరాలుగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యాలకే గండికొట్టింది. ప్రస్తుత రాజకీయ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా ఓటర్లు కదంతొక్కాలని విజయ్ పిలుపు ఇవ్వడం బ్రహ్మాండమైన మద్దతు అందించింది. గత ఏడాది నేపాల్‌లో జరిగిన అల్లకల్లోలమైన ఎన్నికలను పరిశీలిస్తే యువ ప్రభంజనం రాజకీయ మార్పును ఉవ్వెత్తున తీసుకు రాగలిగింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొత్త నాయకుడైన ర్యాపర్ బాలేంద్ర షాను ఎలా అగ్రస్థానానికి తీసుకు వచ్చిందో అర్థమవుతుంది. అదే విధంగా విజయ్ విషయంలో మార్పు జరిగింది. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విప్లవాత్మకమైన మార్పులకు దారి తీస్తాయని సూచించేలా ఎటువంటి హింస గానీ, ప్రాణాంతకమైన నిరసనలు కానీ జరగలేదు. కానీ ప్రస్తుత పార్టీల పాత రాజకీయ సిద్ధాంతాలపై, పరిపాలనా విధానాలపై ఓటర్లలో ముఖ్యంగా యువతలో తీరని అసంతృప్తి కొనసాగుతుండడమే విజయ్ విజయానికి ఊతం ఇచ్చిందని చెప్పవచ్చు.

వాస్తవానికి డిఎంకె అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితుల నుంచే ఆవిర్భవించింది. ద్రవిడ సిద్ధాంత పునాదుల పటిష్టతపైనే మనుగడ సాగిస్తోంది. దీనికి ఆనాడు విద్యార్థులు కూడా తోడ్పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 1950, 1960 నాటి సిద్ధాంతాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతకు కావలసింది తమ సమస్యలను పరిష్కరించే నూతన నాయకత్వమే. జెన్‌జెడ్ ఉద్యమం సాగుతోంది. డిఎంకె, ఎఐఎడిఎంకెలను సంఘర్షిస్తోంది. క్యాంపస్ రాజకీయాలు సన్నగిల్లాయి. చాలా కాలేజీల్లో విద్యార్థి యూనియన్లే లేవు. ఒకవేళ ఎక్కడో ఉన్నా రాజకీయ రహితంగానే ఉంటున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టి నిరుద్యోగ సమస్యపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మానవీయ శాస్త్రాలకు దూరమవుతూ ఇంజినీరింగ్, వృత్తి విద్యాకళాశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ ఓటర్లంతా కొత్త పాలనా వ్యవస్థను ప్రగాఢంగా కోరుకోవడం కనిపిస్తోంది.

యువతలో డిజిటల్ ఓటర్లు సంఖ్య పెరిగింది. చాలా నియోజకవర్గాల్లో ఓటర్లకు విజయ్ పార్టీ పేరు కానీ, విజయ్ పార్టీ అభ్యర్థులు కానీ తెలీదు. విజయ్ ముఖం చూసి, ఆయన పార్టీ గుర్తు చూసే ఓటు వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో క్రిస్టియన్ సమాజం ఓట్లు విజయ్ గెలుపునకు కారణమయ్యాయి. గతంలో వీరంతా డిఎంకె పార్టీకే మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. కన్నియ కుమారి వంటి జిల్లాల్లో క్రిస్టియన్ ఓట్లు విజయ్ ఓటు బ్యాంకును పరిపుష్టం చేశాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం, ముందస్తు అనుభవం లేని వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించడం ప్రపంచంలో చాలా అరుదైన విషయం. దీనికి సాధారణంగా ముందుగానే కొంత అనుకూలతలు ఉండడం అవసరం.

ఇమ్రాన్ ఖాన్, డొనాల్డ్ ట్రంప్, వంటి నేతలు రాజకీయాల్లోకి రావడానికి ముందే వాణిజ్య పరంగా, రాజకీయ పరంగా ప్రముఖులతో వారికి సన్నిహిత సంబంధాలుండేవి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొదట ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి. స్కూల్ టీచరుగా పనిచేసేవాడు. అవినీతిపై పోరాటం పేరుతో ప్రజల్లో పాప్యులారిటీ పెంచుకుని క్రమేణా ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యాడు. అలాగే అవినీతి మహమ్మారిపై పోరు సాగించే ఉద్యమాన్ని చేపట్టి కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీని నెలకొల్పి ఢిల్లీ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పాడు. ఈ సందర్భాలన్నీ పరిశీలిస్తే అవినీతిపై పోరాటమే ప్రధాన సూత్రంగా పనిచేసింది. పాత, స్థిరపడిన వ్యవస్థాపరమైన నాయకులకు గుణపాఠం చెప్పగలిగింది. పాత నాయకుల పనితీరుపైన, పాలనపైన రగులుతున్న అసంతృప్తి ఆ నాయకులను పదవీభ్రష్టుల్ని చేయగలిగింది. విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు ఎంతవరకు అనుకూలత ఏర్పడుతుందో చూడాలి.