
సరూర్ నగర్: మేడ్చల్ మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. అర్బన్ రెస్టారెంట్ లో బిల్లు కట్టమన్నందుకు సిబ్బంది, యాజమాన్యంపై రౌడీలు కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దుండగుల దాడిలో అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ మూకుమ్మడి దాడి చేశారు. బాధితులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుల్లో నేరచరిత్ర ఉన్న ఏదుల ప్రసన్న రెడ్డి , ఏదుల యశ్వంత్ రెడ్డి వారి అనుచరులుగా గుర్తించారు. ఏదుల ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్ ను ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి దారుణంగా హత్య చేశారు. ఈనెల రెండో తేదీన ఘటన జరగగా నిందితుల కోసం పోలీసులు జల్లడ పడుతున్నారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉంది అంటూ వారిపై కఠిన చర్యలు పోలీసులు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏదుల ప్రసన్న రెడ్డి ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకొని బార్లు, రెస్టారెంట్లలో నయా దందా సాగిస్తున్నట్టు సమాచారం.