
సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ చిక్కుల్లో పడ్డాడు. టీం ఇండియా క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్‌కి గతేడాది నవంబర్‌లో జరగాల్సిన వివాహం రద్దైన విషయం తెలిసిందే. తాజాగా స్మృతి ఫ్రేండ్ విజ్ఙాన్ ప్రకాశ్ మహారాష్ట్రలోని సంగ్లీ పోలీస్ స్టేషన్‌లో పలాశ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పలాశ్‌పై సంగ్లీ పోలీసులు ఎస్సి/ఎస్టి కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సినిమా ప్రాజెక్టు కోసం పలాశ్ తన వద్ద రూ.25 లక్షలు తీసుకున్నాడని విజ్ఞాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి.. ఆ తర్వాత మోసం చేశాడని ఆరోపించాడు. గత ఏడాది నవంబర్ 22న సంగ్లీ-అష్టా రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలాశ్ తన కులాన్ని ఉద్దేశించి దూషించాడని, అసభ్య పదజాలంతో అవమానించాడని విజ్ఞాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.