← Back to headlines

చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు

2026-05-07 15:52 • original

ఖైదీలకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ అందించి, విడుదల తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చర్యలు చేపట్టేందుకు చర్లపల్లి సెంట్రల్ జైలు ప్రాంగణంలో కొత్త ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కార్యదర్శి హరిచందన దాసరి ఈ మేరకు గురువారం జిఓ 137 జారీ చేశారు. ఖైదీలకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, జైలు నుంచి విడుదలయ్యాక ప్రధాన స్రవంతి ఉపాధి రంగంలోకి వారి మార్పును సులభతరం చేయడం ఈ ఐటీఐ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.

దీనివల్ల సామాజిక కళంకం, ఆర్థిక అనిశ్చితిని నివారించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఒక ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు జైళ్ల శాఖ డీజీకి అనుమతిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులు, డిజిటి నిబంధనలకు లోబడి అన్ని షరతులను పాటించాలని స్పష్టం చేసింది. ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ వెంటనే జైళ్ల శాఖకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయాలని, సంబంధిత నిబంధనలు, విధానాలు పాటించాలని ఆదేశించింది. జైళ్ల శాఖ డిజి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.