
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు డోలీ మోత కష్టాలు తప్పడంలేదు. లింగాపురం గిరిజనగూడలో పురిటి నొప్పులతో బాధ పడుతున్న సునీతను గిరిజనులు 2 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీలో తీసుకెళ్లి అనంతరం ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. వాళ్లతో పాటు ఆశ వర్కర్ కూడా ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన గిరిజనుల బతుకులు మారడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డోలీ మోతాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, సరైన సదుపాయాలు లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంతో పాటు గ్రామాలకు సమీపంలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దేశంలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం రాకముందు డోలీ మోతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అంటే పట్టణాలేనా, గిరిజన ప్రాంతాలు ప్రభుత్వాలకు కనిపించావా? అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.