← Back to headlines

బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త..

2026-05-08 01:40 • original

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో కార్మికుల వేతనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు కొత్త వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. తాజా ఒప్పందం ప్రకారం వెయ్యి బీడీలు చుడితే కార్మికులకు ఇచ్చే వేతనాన్ని రూ.6 మేర పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.268.31 చెల్లిస్తుండగా, పెంపు తర్వాత అది రూ.275.23కు చేరనుంది. జాతీయ సెలవులు, బోనస్ వంటివి కలుపుకొంటే వెయ్యి బీడీలపై మొత్తం రూ.6.92 (15.33%) పెరుగుదల ఉంటుందని కార్మిక సంఘాలు తెలిపాయి. తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారిలో 98 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్, జనగాం జిల్లాల్లో ఈ పరిశ్రమ విస్తరించి ఉంది. నిజామాబాద్‌ను బీడీ పరిశ్రమకు కేంద్రంగా పరిగణిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి కార్మిక సంఘాలు యాజమాన్యాలతో చర్చలు జరిపి వేతన ఒప్పందాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

The post బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. appeared first on Navatelangana.