← Back to headlines

ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విజయం..

2026-05-08 01:36 • original

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (111) మెరుపు సెంచరీతో కదం తొక్కగా, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (3/33) కీలక వికెట్లతో మాయ చేయడంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఈ గెలుపుతో లక్నో తమ వరుస ఆరు ఓటముల పరంపరకు తెరదించి, ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్‌లో సొంత మైదానంలో లక్నోకు ఇదే తొలి విజయం కావడం విశేషం.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు మిచెల్ మార్ష్ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ, కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతనికి నికోలస్ పూరన్ (38) జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టు స్కోరును 3 వికెట్ల నష్టానికి 209కి చేర్చాడు. వర్షం కారణంగా ఆర్సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జాకబ్ బెథెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 2023 ఏప్రిల్ తర్వాత ఐపీఎల్‌లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్ (61), దేవదత్ పడిక్కల్ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. పడిక్కల్‌ను తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి ఔట్ చేసిన ప్రిన్స్, ఆ తర్వాత జితేశ్ శర్మను కూడా పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే పాటిదార్ కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ పతనం మొదలైంది. చివర్లో కృనాల్ పాండ్య (28 నాటౌట్‌), రొమారియో షెపర్డ్ (23 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది.

The post ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విజయం.. appeared first on Navatelangana.