ఒకప్పుడు ప్రపంచదేశాలను వణికించిన బలగాలు
నేడు టెహ్రాన్ దెబ్బకు భూగర్భాల్లో దాక్కుంటున్న మిలటరీ
తమ సైనిక శక్తితో ప్రపంచదేశాలలో యుద్ధాలు రగిలించిన యూఎస్..
ఇప్పుడు అదే యుద్ధ సాంకేతికతకు వణుకు సొరంగాల్లో ఆస్పత్రులు నిర్మిస్తున్న వైనం
టెక్సాస్ : ఒకప్పుడు ప్రపంచానికి అజేయ శక్తిగా తనను తాను ప్రకటించుకున్న అమెరికా సైన్యం ఇప్పుడు భూమి అడుగున దాక్కునే స్థితికి చేరింది. డ్రోన్లు, క్షిపణులు, నిరంతర గగన నిఘా… ఇవన్నీ అమెరికా ప్రపంచ యుద్ధాల్లో విస్తృతంగా ఉపయోగించిన పద్ధతులు. కానీ ఇప్పుడు అదే సాంకేతికత అమెరికా సైనిక వ్యవస్థను వెంటాడుతోంది. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్‌లో అమెరికా ఆర్మీ నిర్వహించిన తాజా శిక్షణ కార్యక్రమమే దీనికి స్పష్టమైన ఉదాహరణ. భారీ టెంట్ ఆస్పత్రుల బదులు పాత అణు సొరంగాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేసి, డ్రోన్ దాడుల భయంతో వైద్య సిబ్బందిని ‘కనిపించకుండా’ పని చేయాలని శిక్షణ ఇస్తోంది.ఎప్పుడూ యుద్ధాలను కాంక్షించే అమెరికా… ఇప్పుడు భయంతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా, ఇరాన్… ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో అమెరికా సైనిక జోక్యాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి.
ఇప్పుడు అదే అమెరికా… యుద్ధాలలో జరిగే డ్రోన్ దాడులకు వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వివరిస్తున్నారు. డ్రోన్ దాడుల పేరుతో అమెరికా ఇతర దేశాలపై దారుణ దాడులకు దిగింది. విద్యా సంస్థలు, ఆస్ప్రతులపై బాంబులు వేసింది. వివాహ వేడుకలను పేల్చింది. అనేక గ్రామాలు నేలమట్టమ య్యాయి. పిల్లలు, మహిళలు సహా లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఇరాన్‌తో యుద్ధంలో ఒక స్కూల్‌పై దాడికి దిగడం, అక్కడ వందల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అయితే అమెరికా మాత్రం ఈ దాడులను తరచుగా సమర్థించుకుంది. కానీ ఇప్పుడు అవే డ్రోన్ దాడులు, యుద్ధాలు అమెరికా సైన్యానికి చేదు వాస్తవాలను పరిచయం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
బతికుంటే చాలు..
అమెరికా సైన్యమే భయంతో భూమి అడుగున దాక్కుంటోందనీ, ఎలక్ట్రానిక్ సంకేతాలు ఆపేస్తోందనీ, వెలుతురుకు కూడా భయపడుతోందని విమర్శలు వినబడుతున్నాయి. టెక్సాస్‌లో జరిగిన శిక్షణా కార్య్రకమం ఒక పెద్ద రాజకీయ, సైనిక సత్యాన్ని బయటపెడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధాలు సృష్టించే అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు చివరికి తమ సొంత యుద్ధ భయాల్లోనే చిక్కుకుంటున్నాయని గుర్తు చేస్తున్నారు. డ్రోన్ల యుగం అమెరికాకు ఒక కఠినమైన పాఠం నేర్పుతోందని వివరిస్తున్నారు. అధునాతన ఆయుధాలు తయారు చేయడం సులువేననీ, కానీ వాటి వల్ల కలిగే భయంతో జీవించడం చాలా కష్టమని చెప్తున్నారు. ప్రపంచంలో తానే సూపర్ పవర్ అనుకునే యూఎస్‌కు ఈ పరిస్థితులు మింగుడు పడనీయడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
మానవత్వమంటూ మాటలు..
ఆస్పత్రులు అమెరికా టార్గెట్
అమెరికా అధికారులు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపుతూ వార్‌లో వైద్య సిబ్బంది కూడా టార్గెట్‌గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం అమెరికా గతంలో చేసిన అమానవీయ దాడులను గుర్తు చేస్తున్నారు. ఇరాక్‌లో ఫలూజా ఆస్పత్రులపై దాడులు, ఆఫ్ఘనిస్తాన్‌లోని మెడికల్ కేంద్రాలపై బాంబులు వేసింది అమెరికా సైన్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధ చట్టాలు, జెనీవా ఒప్పందాలు, మానవ హక్కుల గురించి ప్రపంచానికి బోధించే అమెరికానే గతంలో అనేక వివాదాస్పదమైన సైనిక చర్యలకు కారణమైందని వారు అంటున్నారు. ఇప్పుడు అదే అమెరికా సైనిక వ్యవస్థ ‘మా వైద్య సిబ్బందిని’ రక్షించాలి అని అంటోందని చెప్తున్నారు. ఇక ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగి 68 రోజులు దాటినా..ముందడుగు వేయలేక, వెనకకు రాలేక…చర్చలంటూ బెదిరిస్తోంది ట్రంప్ సర్కార్. వాస్తవానికి ఈ యుద్ధంలో ఇరాన్‌ను సులువుగా జయించొచ్చని ఆ రెండు దేశాలూ భావించాయి. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ ప్రతిదాడులతో అమెరికా, ఇజ్రాయిల్‌లు తీవ్ర సైనిక నష్టాన్ని చూశాయి. అయితే ఆ మరణాల సంఖ్యను మాత్రం బయటకు రాకుండా దాచి పెట్టాయని విశ్లేషకులు
‘సూపర్ పవర్’కు పరిచయమైన భయం
భూగర్భాల్లో ఆస్ప్రతుల ఏర్పాటు అనేది సూపర్ పవర్‌గా చెప్పుకునే అమెరికాకు కలిగిన భయానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇందులో భాగంగా ఫోర్ట్ హుడ్ ప్రత్యేక చర్యల్లో భాగంగా అమెరికా సైన్యం.. పాత అణుసొరంగాల్లో ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. డ్రోన్లకు కనిపించకుండా కమ్ముఫ్లాజ్ వలలు వాడింది. రాత్రిళ్లు ఎరుపు కాంతులలో మాత్రమే పని చేసింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆపేసింది. పాత టెలిఫోన్లను ఉపయోగించింది. ఇది కేవలం వ్యూహ మార్పు కాదనీ, ఆధునిక యుద్ధాల్లో అమెరికా సైనిక ఆధిపత్యం క్షీణిస్తోందనే సంకేతమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
డ్రోన్ యుగం… అమెరికాకు నేర్పిన చేదు నిజం
యుద్ధోన్మాదంతో వ్యవహరించే అమెరికాకు డ్రోన్ దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఇరాన్ దెబ్బకు ఆ ప్రభావం తెలిసొచ్చింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఫలితంగా భారీ సంఖ్యలో నష్టం సంభవించింది. యూఎస్ చరిత్రలో కీలకమైన యుద్ధనౌకలు అబ్రహం లింకన్, గెరాల్డ్ లాంటి వి కూడా ఊహించని విధంగా క్షిపణి దాడుల్లో నష్టపోయాయి. సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినటమే కాదు… అమెరికన్లలోనూ ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌పై అమెరికా యుద్ధం గల్ఫ్ దేశాలను మరింత సంక్షోభంలో నెట్టడానికి కారణమైంది. దీంతో అమెరికాకు నో అనని సౌదీ అరేబియా కూడా వద్దురా బాబూ అనేలా పరిస్థి తి మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
The post అమెరికా సైన్యానికి ప్రాణభయంఅమెరికా సైన్యానికి appeared first on Navatelangana.