
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ హైదరాబాద్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంతకుముందు పంజాబ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో సన్‌రైజర్స్ పోరుకు సిద్ధమైంది. అంతేగాక ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇలాంటి స్థితిలో ఉప్పల్‌లో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. ఇందులో గెలిచి అగ్రస్థానాన్ని కాపాడు కోవాలనే లక్షంతో బరిలోకి దిగనుంది.
ఇక కిందటి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో అనూహ్య ఓటమి పాలైన సన్‌రైజర్స్‌కు పోరు కీలకంగా తయారైంది. కోల్‌కతాపై బ్యాటర్లు విఫలం కావడం జట్టుకు ఆందోళన కలిగించే అంశమే. ఆ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌లు మాతరమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో సన్‌రైజర్స్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, హెడ్‌లు మరోసారి మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు మెరుపులు మెరిపిస్తే భారీ స్కోరు సాధించడం జట్టుకు కష్టమేమీ కాదు. ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, కమిన్స్‌లతో జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కానీ కోల్‌కతాపై మాత్రం బ్యాటర్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాటర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పంజాబ్ కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, కనోలి, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లు ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రాన్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరు మరోసారి మెరుగైన ఆరంభాన్ని అందిస్తే సన్‌రైజర్స్ బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. బౌలింగ్‌లోనూ పంజాబ్ బాగానే ఉంది. అర్ష్‌దీప్, హర్‌ప్రీత్ బ్రార్, చాహల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టులో ఉన్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.