
‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా’ అనే రీతిలో అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం కవ్వింపులకు పాల్పడుతూ, ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ పశ్చిమాసియాను ఇప్పటికే రణరంగంగా మార్చేశాయి. కాల్పుల విరమణ కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో సంయమనం పాటించాలన్న ఇంగితం ఇరు దేశాలకూ కొరవడటంతో మళ్లీ యుద్ధజ్వాలలు రగులుకునే పరిస్థితి ఏర్పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతిపెద్ద చమురు నిల్వల కేంద్రమైన ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌పై తాజాగా ఇరాన్ డ్రోన్లతో దాడి జరపడంతోపాటు హర్మూజ్ జలసంధిలో తిరుగాడుతున్న అమెరికా నౌకలపైనా విరుచుకుపడటంతో కాల్పుల విరమణకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి దాపురించింది. అదే జరిగితే యుద్ధానికి దిగిన ఇరాన్, అమెరికా మాట అటుంచి, పశ్చిమాసియా సహా ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే. పశ్చిమాసియాలో రగిలిన యుద్ధం తాలూకు ప్రభావం ఇప్పటికే దేశదేశాలనూ అతలాకుతలం చేస్తోంది. అనేక దేశాలలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి.
వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెంచిన భారత ప్రభుత్వం రేపోమాపో పెట్రో ధరలనూ పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దేశదేశాలనూ ఆర్థిక మాంద్యం కమ్ముకుంటున్న దాఖలాలు గోచరమవుతున్నాయి. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి మనుగడ కష్టసాధ్యంగా మారింది. ఈ పరిస్థితినుంచి ఏ ఒక్క దేశానికీ మినహాయింపు లేదు. కయ్యానికి కాలుదువ్విన అగ్రరాజ్యం పరిస్థితి సైతం ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. పూటకో మాట, రోజుకో నిర్ణయంతో అమెరికాను భ్రష్టుపట్టిస్తున్న ట్రంప్ మహాశయుడి పుణ్యమాని, ఆ దేశంలోనూ చమురు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం కారణంగా అమెరికాకు ప్రత్యక్షంగా జరిగిన నష్టమూ తక్కువేమీ కాదు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ అధ్యయనం మేరకు తొలి మూడువారాల్లోనే దాదాపు మూడు బిలియన్ డాలర్ల మేర సైనిక ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు అంచనా. సుమారు 13 మంది సైనికులు మరణించగా, దాదాపు వందమంది వరకూ గాయపడ్డారు. ఈ యుద్ధంవల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు ఇపాన్-రాయిటర్స్ సంస్థ సర్వేలో తేలడం గమనార్హం.
వారం రోజుల్లో ఇరాన్ మెడలు వంచవచ్చన్న ధీమాతో యుద్ధానికి దిగిన ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక తలకిందులవుతున్నారు. ఘర్షణ ముగించేందుకు అమెరికా తొమ్మిది ప్రతిపాదనలతో ముందుకు రాగా, వాటిని తోసిపుచ్చి ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది. తాత్కాలిక సంధి కాదు.. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడమే తమకు కావలసిందని తెగేసి చెప్పడంతో అగ్రరాజ్యాధినేతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధం ముగిసిందని ఒకసారి, ఇరాన్‌ను ఓడించడం తమకు చిటికెలో పని అని మరొకసారి, తాము సముద్రపు దొంగలవంటివారమని ఇంకొకసారి అర్థం పర్థం లేని ప్రకటనలు చేస్తూ, ప్రపంచ దేశాధినేతల ముందు చులకన అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు జననష్టం, ఆస్తినష్టం ఎంత జరిగినా ఇరాన్ దిగిరాదనే వాస్తవాన్ని ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. బలప్రయోగం చేస్తే ఉభయభ్రష్టత్వం తప్ప ఒరిగేదేమీ ఉండదనే సత్యాన్ని ఇకనైనా గుర్తించాలి. నాటో సభ్యత్వ దేశాలు తనకు కలసిరావడం లేదని కారాలు మిరియాలూ నూరడం మాని, అవి ఎందుకు కలసి రావడం లేదో ఆలోచించాలి
. ఒత్తిడి పెంచితే ప్రత్యర్ధి తలవంచుతాడనే బైడెన్ సిద్ధాంతం ఇరాన్ విషయంలో పనిచేయదన్న విషయం యుద్ధం మొదలైన ఈ రెండు నెలల్లోనే బోధపడింది. కాబట్టి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి కనబరిస్తే తమకూ, ప్రపంచ దేశాలకూ కూడా ట్రంప్ మేలు చేసినవారవుతారు. ఇరాన్ యురేనియం శుద్ధి ప్రక్రియ విషయంలోనూ అగ్రరాజ్యం తన ఉడుంపట్టును సడలించుకోవలసిన అవసరం ఉంది. 20 ఏళ్ల నిషేధం కాకుండా ఉభయతారకంగా ఉండేలా నిబంధనలను రూపొందించుకోవడం ఉత్తమం. ఇరాన్ కోరుతున్నట్లుగా ఒప్పందం అంటూ కుదిరితే, ఆ దేశం పై తాత్కాలికంగా కాకుండా, శాశ్వతంగా దాడులు చేయకుండా ఉండాలి. అమెరికా- ఇరాన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రత్యక్షంగా పశ్చిమాసియా భవిష్యత్తుపైనా, పరోక్షంగా ప్రపంచదేశాలపైనా ఉంటుందనే విషయాన్ని గమనించి ముందడుగు వేయాలి.