
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కేబుళ్ల చోరీకి పాల్పడిన నిందితుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో స్టేడియం సీసీటీవీ నిఘా వ్యవస్థకు అంతరాయం కలిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు స్టేడియం ఆవరణలో అమర్చిన పవర్ కేబుళ్లు, క్యాట్-6 నెట్‌వర్క్ కేబుళ్లను అపహరించినట్లు స్టేడియం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎల్ ఆనంద్ భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా స్టేడియంలోని సీసీటీవీ నిఘా వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఫుటేజీల ఆధారంగా అనుమానితుడు జితు సోలంకి (20)ని అదుపులోకి తీసుకున్నారు. అతడు నార్సింగి అజీజ్‌నగర్ ప్రాంతానికి చెందినవాడని, ప్రస్తుతం నాగారం, రామంతపూర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో స్టేడియం పరిసరాలను గమనించి ఎవరూ లేని సమయంలో కేబుళ్లను చోరీ చేసి వాటిని గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించాడు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును డీసీపీ కె. సురేష్ కుమార్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ ఎన్. వెంకటరమణ, ఏసీపీ వై. వెంకట్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ వై. రామలింగారెడ్డి, డీఐ రవి కుమార్, ఎస్‌ఐ రజినీకర్ క్రైమ్ టీమ్ ఛేదించారు.