
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న, జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మంతివర్గ ఉప సంఘం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సబ్ క మిటీ సభ్యులకు రాష్ట్ర రైతుల తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను మద్దతు ధర పథకం పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటి కీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడమే కాకుం డా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. అయితే తెలంగాణలో మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వచ్చి పంటలను కొనుగోలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి సీజన్లో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు నష్టం కలగకుండా కనీస మద్దతు ధర వద్ద కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు తమ జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించిన నేపథ్యంలో,
మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న తరహాలోనే జొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల జొన్న రైతులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రాష్ట్రంలో మొక్కజొన్న పంటను సుమారు 11.21 లక్షల ఎకరాలలో సాగు చేయగా, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరానికి సగటు 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే జొన్న పంటను 3.68 లక్షల ఎకరాలలో సాగు చేయగా, ఎకరానికి సరాసరి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు.
పంటల కొనుగోళ్లకు రూ.6000 కోట్ల వరకు వ్యయం
ఈ ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6000 కోట్ల వరకు వ్యయం చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతుల ఆదాయ భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం నుండి సహకారం లేకపోయినా రైతులను కష్టాల్లో వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోళ్లు నిర్వహించడం జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నిర్ణయం రైతులకు మరింత భరోసా కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సబ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని జొన్న రైతులకు పెద్ద ఊరటనిస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల ఆదాయ భద్రతకు ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.