
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. కాళేశ్వరంపై కమిషన్ వేసి అసెంబ్లీ తీర్మానం ద్వా రా సీబీఐ విచారణ చేపట్టకుండా కేసీఆర్‌ను బీజేపీ ప్రభుత్వం కాపాడుతుందని గృహ ని ర్మాణ, రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీపై ధ్వజమెత్తారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన రైతుమేళా కార్యక్రమాన్ని మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు మేళాను ఉద్దేశించి మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వరి వేస్తే ఉరే అని గత సీఎం కేసీఆర్ రైతులను అనేక రకాలుగా నష్టపెట్టారని ఇదే ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో భావి భారత ప్రధాని రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ,
సన్న ధాన్యానికి రూ.500 ఇస్తామన్న ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను అమలుచేసేందుకు రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు సీఎం కసరత్తు చేసి 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లను ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందన్నారు. ఇంత పెద్ద రుణమాఫీ దేశ చరిత్రలో మొదటిదన్నారు. ఇచ్చిన వాగ్దానం కోసం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేస్తున్నారన్నారు. ఇది గిట్టని బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు అసంబద్ధమైన విష ప్రచారం ప్రభుత్వంపై చేపడుతున్నారని, ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరూ ఏం చేయలేరన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు కొల్లగొట్టారన్నారు. దాని ఫలితంగా ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందన్నారు. దానిపై విచారణ జరిపించి నిగ్గు తేల్చేందుకు ఘోష్ కమిషన్ వేసి విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సీబీఐకి అప్పజెప్పామన్నారు. అప్పటిదాకా బీజేపీ నాయకులు మోదీ, అమిత్ షాల నాయకత్వం కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు కాళేశ్వరం అవినీతిపై తమకు అవకాశం కల్పిస్తే సీబీఐతో విచారణ జరిపిస్తామని పలు సందర్భాల్లో చెప్పారని, తీరా సీబీఐకి అప్పగించాలని తీర్మానిస్తే ఇప్పటివరకు దానిపై విచారణ ఊసేలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొంతమేరకే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని మిగిలిన ప్రాజెక్టుపై విచారణ కోరలేదని, చెప్పినమేరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్లు, యాదాద్రి భువనగిరి విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో జరిగిన అవినీతిపై క్యాబినెట్ తీర్మానం పెట్టి నేడో, రేపో సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు చిత్తశుద్ధి ఉంటే వీటిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉందనే జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టి పట్టం కట్టారన్నారు. దానిని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు కుదుర్చుకునేందుకు ఒక్కటవుతున్నాయన్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను తొక్కి పెడుతున్నారని పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు. రైతులకు కావాల్సిన యాంత్రీకరణ, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ పెద్ద ఎత్తున అమలుచేస్తున్న ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా ధాన్యం, మక్కలను కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తున్నామన్నారు. అందుకే వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు రైతులకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందించడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రైతుమేళాలను నిర్వ హించడం జరుగుతుందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.