← Back to headlines

చేతనైతే భద్రాచలం రాముని గుడికి రూ.700 కోట్లు కేటాయించాలి: మంత్రి కొండా సురేఖ

2026-05-07 15:29 • original

భద్రాచలం రాముడు, హిందుత్వంపై తాను మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరిస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వారికి అవసరమైన రెండు పదాలనే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తనను హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేయడం సరైంది కాదని, బీజేపీ నాయకుల వైఖరిని ఖండిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను హిందూ మహిళను అని, రోజు ఇంట్లో దేవునికి పూజ చేసి బొట్టు పెట్టుకొని బయటకు వెళ్లడమే కాకుండా హిందూ సంప్రదాయాలను కొనసాగించే వ్యక్తినని ఆమె అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ మతాన్ని కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు.

సీఎం రేవంత్ నాయకత్వంలో మంత్రిగా తన శాఖ నుంచి భద్రాచలం గుడి పునర్నిర్మాణానికి రూ.380 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. బీజేపీ నాయకులకు హిందూత్వంపై.. భద్రాచలం రామునిపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ.740 కోట్లను మంజూరుచేసి వారి రామభక్తి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దేవున్ని కొలవడం తప్పు కాదని, ఎవరి పని వారు చేసుకొని దైవ స్మరణలో ఉన్నపుడు వారి జీవితాలు మంచిగా ఉంటాయని హితవు పలికారు.