← Back to headlines

ఐకేపీ కేంద్రాల్లో అన్నదాతల అరిగోస: హరీశ్‌రావు

2026-05-07 15:10 • original

ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగక అన్నదాతలు అరిగోస పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి నజరానాలు పంపే పనిలో పడ్డాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అక్కడ విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యపు నిల్వలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యం తూకం వేయాలంటే కనీసం 25 నుంచి 30 రోజుల సమయం పడుతుందని రైతులు చెప్పడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. సుమారు 45 డిగ్రీల ఎండలో అన్నదాతలు ధాన్యపు రాశుల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నల్గొండ, మంచిర్యాల జిల్లాల్లో ఇద్దరు రైతులు అసువులు బాసిన విషయాన్ని గుర్తుచేశారు.

క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏసీ గదుల్లో కూర్చుని ఎలాంటి సమస్య లేదని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. మ్యాచర్‌పాస్ అయిన వడ్లను తూకం వేయడానికి వారం రోజులకు పైగా సమయం ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. మరోపక్క తాలు ఉన్నదన్న సాకుతో క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేయడం చేతకావడం లేదన్నారు. రేవంత్ పాలనలో యూరియా దగ్గరి నుంచి మొదలు రైతుబంధు, సాగునీరు, చివరికి పండిన పంటను అమ్ముకోవాలన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. 2022లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని ఆయన గర్వంగా చెప్పారు. రైతు సమస్యలు పరిష్కరించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని రైతు వారోత్సవాలు జరుపుకొంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అన్నీ బాగున్నప్పుడు రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా మంత్రులు, సంబంధిత అధికారులు మేల్కొని లారీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి రెడ్డి, పల్లె రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.