← Back to headlines

మమతను ఓడించినందుకే నా సహాయకుడిని హత్య చేశారు

2026-05-07 15:00 • original

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీని తాను ఓడించిన కారణంగానే తన సహాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేశారని ఆయన ఆరోపించారు. బరాసత్ స్టేట్ జనరల్ హాస్పిటల్ వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన సువేందు అధికారి, అతను నా సహాయకుడు కాకపోయి ఉంటే లేదా నేను మమతా బెనర్జీని రాజకీయంగా ఓడించకపోయి ఉంటే ఈ హత్య జరిగి ఉండకపోవచ్చు అని అన్నారు. భవానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో తాను విజయం సాధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నేను అతని కుటుంబానికి అండగా ఉంటాను. హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో అతనిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తేలింది. అతని శరీరంలో బుల్లెట్లు దొరికాయి. ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని సువేందు అధికారి ఆరోపించారు. చంద్రనాథ్ రథ్‌కు వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా ఎలాంటి శత్రుత్వాలు లేవని కూడా ఆయన పేర్కొన్నారు.


కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రథ్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామమైన చందిపూర్‌కు తరలించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సహా పలువురు బీజేపీ నేతలు రథ్‌కు నివాళులర్పించారు. దర్యాప్తు పురోగతిపై కూడా సువేందు అధికారి స్పందించారు. ఘటనలో దుండగులు ఉపయోగించినట్లు భావిస్తున్న మోటార్‌సైకిల్‌ను సంఘటన స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు. డీజీపీతో నేను మాట్లాడాను. పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ, ఫోరెన్సిక్ బృందాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసుపై పనిచేస్తున్నాయి. పోలీసులు సరైన దిశలో ముందుకు వెళ్తున్నారు అని సువేందు అధికారి అన్నారు.

ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇలాంటి కేసులను ఛేదించే సామర్థ్యం పోలీసులకు గతంలో కూడా ఉందని, కానీ అప్పుడు వారికి స్వేచ్ఛ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. రథ్ హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలన్న తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్‌కు ప్రాధాన్యం లేదని, రాష్ట్ర పోలీసులే కేసును ఛేదిస్తారని అన్నారు. ఇక రథ్ తల్లి మాత్రం హంతకులకు మరణదండన కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరారు. బిడ్డను కోల్పోవడం ఎంత బాధో నాకు తెలుసు అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ సంఘటనతో మరింత పెరిగాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో రథ్‌పై జరిగిన కాల్పులను బీజేపీ కుట్రపూరిత హత్యగా అభివర్ణించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ హింస ఆరోపణలు వెల్లువెత్తాయి.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మధ్యమ్‌గ్రామ్‌లోని దోల్తాలా ప్రాంతంలో బుధవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది.

బైక్‌లపై వచ్చిన దుండగులు రథ్ వాహనాన్ని వెంబడించి ఆపి కాల్పులు జరిపిన తర్వాత పరారైనట్లు తెలిపారు. ఈ ఘటన రథ్ నివాస సముదాయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే జరిగింది. దాడి సమయంలో కారు నడుపుతున్న బుద్ధదేబ్ బేరా కూడా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు పలు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.