
ఢిల్లీ: విమానంలో పురుషులు తనని వేధించారని టిఎంసి ఎంపి మహువా మొయిత్రా తెలిపారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘంలో సమావేశంలో పాల్గొనేందుకు విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ట్విట్టర్‌లో ఆమె వీడియో పోస్టు చేశారు. తాను 6ఇ719 అనే నంబరు గల ఇండిగో విమానంలో ఢిల్లీ బయలుదేరానని, విమానంలో ఎక్కుతుండగా నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తుల అసభ్యంగా తనని చూశారని, విమానం ఢిల్లీలో ల్యాండైన తరువాత దిగుతుండగా సదరు వ్యక్తులు తలుపుల వద్ద నిలబడి తనని హేళన చేశారని, వీడియో కూడా చిత్రీకరించారని తెలిపారు. ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదని, కొంత మంది సంఘీలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో స్పందించానని వివరించారు. ఇది బిజెపి సంస్కృతి అని దుయ్యబట్టారు., ఐదుగురు వ్యక్తులను నో ఫ్లై జాబితాలో చేర్చాల్సిందిగా ఎయిర్ లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో పాటు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇండియో సంస్థకు జత చేశానని వివరించారు.