← Back to headlines

ఎసిబికి పట్టుబడ్డ అటవీశాఖ అధికారులు

2026-05-07 14:55 • original

భధ్రాచలం అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ భద్రాచలం డివిజనల్ ఫారెస్టు అధికారిణి సుజాత, చర్ల ఇన్‌చార్జి డీఆర్‌వో కృష్ణయ్యలు పట్టుబడ్డారు. చర్ల మండలం పూసగుప్ప ప్రాంతంలో నూతన రోడ్డు వేస్తున్న సమయంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఈ నిబంధనల ఉల్లంఘనను సాకుగా చూపి, సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుజాత, చర్ల ఇన్చార్జి డీఆర్‌వో కృష్ణయ్య రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు.

దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో అధికారులు అటవీశాఖ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ సమయంలో రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఇరువురు అధికారులను పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ విలేకర్లతో మాట్లాడుతూ ఇద్దరు అటవీశాఖ అధికారులకు మాకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ రోజు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వీరిని ఏసీబీ కోర్టు హైదారబాద్‌లో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తూ తమను ఏసీబీకి సమాచారం ఇవ్వాలని తెలిపారు