← Back to headlines

రేపు తమిళనాడులో కాంగ్రెస్ ఆందోళనలు

2026-05-07 14:40 • original

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన టివికె అధినేత విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. గవర్నర్ వైఖరికి నిరసనగా శుక్రవారంనాడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ గురువారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని గవర్నర్ అధికారిక నివాసం లోక్‌భవన్‌ను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. రాజధాని చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ కాలరాస్తున్నారని,

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఈ నిరసనలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు కాంగ్రెస్ పిలుపుతో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతుండడంతో ఇప్పటికే టివికె కార్యకర్తలు అసంతృప్తితో రగులుతుండగా వారికి కాంగ్రెస్ కూడా తోడవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సిపిఎం, సిపిఐ, విసికె పార్టీలు కూడా గవర్నర్ వైఖరిని తప్పు పట్టాయి. తమ మద్దతు సంగతి ఎలా ఉన్నా అతిపెద్ద పార్టీగా ఉన్న టివికె అధినేత విజయ్‌ను వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం రాజ్యాంగపరమైన ప్రక్రియ అని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని బిజెపి రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని చూస్తోందని ఆరోపించింది.