
కరీంనగర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంపై, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిపై బిజెపి శ్రేణులు చేసిన దాడిని మాజీ మంత్రి హరీషరావు తీవ్రంగా ఖండించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా..? లేనట్లా..? అని ప్రశ్నించారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని ఆక్షేపించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.