
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు (శుక్రవారం) ఆయన ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుత పరిస్థితి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు చేకూరే ప్రయోజనాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాపులను, ఆయకట్టు, ప్రాజెక్ట్ సామర్థ్యం, ఎత్తు, తదితర అంశాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భూములకు సాగునీరు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రాజెక్టు డిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలపై ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి జూపల్లి అధికారులతో పేర్కొన్నారు. జిల్లా రైతాంగానికి మేలు చేకూర్చేలా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.