
ఆపరేషన్ సిందూర్ భారతదేశ సంకల్ప బలానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా తిప్పికొట్టడం జరుగుతుందని మనం సంకల్పించాం. ఇందుకు అనుగుణంగానే సిందూర్ సైనిక చర్యకు దిగామని ప్రధాని మోడీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి అయిన దశలో ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాద్యమం ద్వారా గురువారం స్పందించారు. పాకిస్థాన్, పిఒకెలలోని పలు ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీశాం. ఈ క్రమంలో మన సంకల్ప బలం అజేయం అని చాటి చెప్పామని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం భారతీయ సైన్యం అసమాన్య, అనితర సాధ్య ధైర్యసాహసాలను ప్రదర్శించింది. ఉగ్రవాద శక్తులపై తమ స్థిరమైన పోరును ప్రపంచానికి చాటి చెప్పారని కితాబు ఇచ్చారు. మన త్రివిధ బలగాల మధ్య ఉన్న సమన్వయం అత్యంత కీలకమైనది, దేశ భద్రత పరిరక్షణలో ఇతరులకు మనం ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. సిందూర్‌కు వాయుసేన నుంచి సాహసోపేత చర్యలు నిర్వహించారు. పశ్చిమ సరిహద్దులలో బిఎస్‌ఎప్ సర్వం సన్నద్ధంగా నిలిచింది. మన నౌకాదళం శత్రువు కదలికలను పసిగడుతూ ముందుకు సాగారని తెలిపారు.