
హైదరాబాద్: పార్టీ నడపాలనే ఉద్దేశం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఉంటే ఇలా దాడులు చేయరని బిజెపి ఎంపి రఘునందన్ రావు ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలు తప్పుడు పనులు చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సమస్యకు భౌతిక దాడులు సమంజసం కాదని, అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నేతలకు ఫ్రస్ట్రేషన్ మొదలైందని, బిఆర్ఎస్ నేతలు పూర్తిగా స్పృహ కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకుడిగా ఎదగొచ్చు అన్నట్లుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘునందన్ రావు సూచించారు. బూతుల సంస్కృతిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రోత్సహిస్తున్నారని, బిఆర్ఎస్ నేతలు బూతులు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అన్నారు. తాము కూడా బిఆర్ఎస్ నేతల మాదిరిగా వ్యవహరిస్తే తట్టుకోలేరని, బిజెపిని రెచ్చగొట్టొద్దని రఘునందన్ రావు హెచ్చరించారు.