← Back to headlines

కాంగ్రెస్ పాలనలో ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారు : హరీష్ రావు

2026-05-07 10:58 • original

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీకి 70 సార్లు పోవడం తప్ప సిఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని, రైతులను రేవంత్ రాచిరంపాన పెడుతున్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలు తప్ప చేసిందేమీ లేదని, వడ్లు కొంటున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అన్నారు. వడ్లు కొంటే రైతులు రోడ్లపై ధర్నాలు ఎందుకు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ పని అయిపోయిందని, తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.

రేవంత్ మాటలు తప్ప చేతలు లేవని, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, అన్నివర్గాలను రేవంత్ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ వర్గాలను రేవంత్ వంచించాడని, తులం బంగారం ఇస్తామని మోసం చేశారని ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదని అన్నారు. కరోనా సమయంలో కూడా కెసిఆర్ రైతుబంధు ఆపలేదని, రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు. కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని, ప్రజలంతా మాజీ సిఎం కెసిఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కంటే డేంజర్ గా కాంగ్రెస్ మారిందని, కాంగ్రెస్ రైతుల ఉసురుపోసుకుంటోందని హరీష్ రావు అన్నారు.