← Back to headlines

బిఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు : తుమ్మల

2026-05-07 07:58 • original

హైదరాబాద్: బిఆర్ఎస్ చేయలేని పనులను సిఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ. లక్ష రుణమాఫీని మాజీ సిఎం కెసిఆర్ పదేళ్లలో ఏనాడు పూర్తి చేయలేదని అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్రస్థాయి రైతుమేళా కార్యక్రమం జరిగింది. రైతుమేళాలో వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తులను మంత్రులు పరిశీలించారు. రైతుమేళా ముగింపు కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..మొదటి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశారని, 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశారని తెలియజేశారు.

రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లను కాంగ్రెస్ సర్కార్ జమ చేసిందని, రుణమాఫీకి బిఆర్ఎస్ ఐదేళ్ల సమయం తీసుకోవడంతో వాళ్లు ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదని తుమ్మల విమర్శించారు. ఒక్క రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్నింటిని నిలిపివేశారని, రైతుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ అని కొనియాడారు. బిఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అహంకార పూరిత బిఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని అన్నారు. ఇవాళ రైతులకు అప్పులు తక్కువున్న రాష్ట్రాల్లో ముందున్నది తెలంగాణ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.