← Back to headlines

ప్రభుత్వ ఏర్పాటు కోసం రెండోసారి గవర్నర్ ను కలిసిన విజయ్..

2026-05-07 06:33 • original

చెన్నై: తమిళగ వెట్రి కజగం(టివికె) అధినేత విజయ్ మరోసారి గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన టివికె.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను ఒప్పించేందుకు నటుడు విజయ్ గురువారం ఉదయం గవర్నర్‌ను కలిశారు. రెండు రోజుల్లో గవర్నర్‌తో ఆయనకు ఇది రెండవ సమావేశం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలలో భాగంగా విజయ్ బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే.

అయితే, మ్యాజిక్ ఫిగర్ సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి పిలుపు రాలేదు. టివికె వద్ద అధికారికంగా తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఇంతకుముందు భావించారని, ఆ దశలో పార్టీ బలంపై ఆయనకు నమ్మకం కుదరలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా చేయాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

కాగా, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టివికె 108 స్థానాలను గెలుచుకుని, మెజారిటీ మార్కుకు 10 స్థానాల దూరంలో నిలిచింది. ఎన్నికలలో తాను గెలిచిన రెండు నియోజకవర్గాలలో ఒకదానిని విజయ్ ఖాళీ చేయనుండటంతో, పార్టీ సీట్ల సంఖ్య 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆ సంఖ్య 112కు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ఆరు సీట్లు కావాల్సి ఉంది. మరోవైపు, వామపక్ష పార్టీలు విజయ్ కు మద్దతు ఇచ్చిందుకు నిరాకరించాయి. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో గందరగోళం నెలకొంది.