← Back to headlines

రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం: చంద్రబాబు

2026-05-07 05:58 • original

అమరావతి: గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను మళ్లించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిధులను దారి మళ్లించడంతో..కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిందని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏడో విడత కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. సరిగా పరిపాలించకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ఒకప్పుడు రూ. 100 ఖర్చు చేస్తే.. ప్రజలకు రూ. 10 చేరేదని, ప్రస్తుతం రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు.

ప్రజా సంతృప్తే తనకు కొలమానం అని మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని అన్నారు. అందరం సమష్టిగా పనిచేయాలని..ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలు వందశాతం పరిష్కరించాలని, అభివృద్ధి లేకుంటే సంపద లేదని, సంపద లేకుంటే సంక్షేమం లేదని పేర్కొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగామని, పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలను తీసుకొచ్చామని అన్నారు. గ్రీన్ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎపి తయారైందని చంద్రబాబు స్పష్టం చేశారు.