
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది గల్లంతయ్యారని, వీరిలో ముగ్గురిని రక్షించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కుతుబ్‌పూర్ పాటియా గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
పడవలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది, నది మధ్యలో ఉన్న ఒక దీవి నుండి దోసకాయలు, కర్బూజాలను కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా, రాత్రి సుమారు 7 గంటల సమయంలో పడవ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విష్ణు, రింకు, పారుల్.. ముగ్గురిని కాపాడారు. గల్లంతైన వారిని.. ఆకాంక్ష (9), రాణి (9), బ్రిజ్‌రాణి (25), లాభ్యాంశ్ (5), మహేష్ (6),ఆదిత్య (11)గా గుర్తించారు.
ఈ ఘటనపై హమీర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) అభిషేక్ గోయల్ బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. "పడవ బోల్తా పడలేదని, దానంతట అదే నీటిలో మునిగిపోయిందని ప్రమాదం నుండి బయటపడిన పడవ నడిపే వ్యక్తి తెలిపాడు. ఈత వచ్చిన వారు సురక్షితంగా బయటపడగలిగారు. గల్లంతైన ఆరుగురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి" అని తెలిపారు.