← Back to headlines

రైతు డిస్కం ఎవరి కోసం?

2026-05-08 04:26 • original

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి రైతుల కరెంటు కష్టాలు కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండించే తెలంగాణ రైతాంగానికి కరెంటు అనేది జీవన్మరణ సమస్య. 2014కు ముందు తెలంగాణ రైతుల కడగండ్లు చెప్పనలవి కానివి. కాలుతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలు, కరెంటు షాకులు, ఆత్మహత్యల అసహజ మరణాలు. జనవరి 1, 2018 సంవత్సరం నుండి తెలంగాణ రైతులు కొన్ని మినహాయింపులు ఉన్నా, 24 గంటల కరెంటు మరీ రెప్పపాటు పోని వాస్తవం కాకున్నా ఎటువంటి కరెంటు ఇబ్బందులు లేకుండా, ఎక్కడా పంటపొలాలు ఎండిపోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారన్న విషయం మట్టుకు వాస్తవం. రైతులకు కరెంటు విషయంలో సంతృప్తిగాయున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ను పూనుకోవడం విస్మయం కలిగిస్తున్నది.

రైతుల కోసమేనంటున్న మషడో డిస్కం ఏర్పాటుకు ముందు రైతులు, రైతుసంఘాలతోని ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ముందుకు వెళ్లడం తొందరపాటుతో కూడిన అనాలోచిత చర్యగా పేర్కొనవచ్చు. రైతు డిస్కం ఏర్పాటు వలన రైతులకే కాకుండా విద్యుత్తురంగంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు అయినటువంటి ఉద్యోగులు, విద్యుత్తు సంస్థలు, రాష్ట్రప్రభుత్వంకు ఎలాంటి ఎవ్వరికీ మేలు జరిగే సూచనలు కానరావడం లేదు. ప్రస్తుత డిస్కంల పనితీరుపట్ల రైతాంగం సంతృప్తిగానే ఉన్నారనే విషయం వాస్తవం. మిగతా విషయాలు ఎలా ఉన్నా సప్లయ్ కండీషన్స్‌పట్ల పెద్దగా ఫిర్యాదులు లేవు. వ్యవసాయ విద్యుత్ వినియోగం లెక్కలు కరెక్టుగా లేవు. ఖచ్చితమైన వినియోగాన్ని తేల్చాలని చాలా రోజులుగా వినిపిస్తున్న డిమాండ్. డిస్కంలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే వ్యవసాయ వినియోగపు లెక్కలు తేల్చడం పెద్ద సమస్యకాదు. అందుకు మాత్రమే మషడో డిస్కం ఏర్పాటు అవసరం లేదు.

జిఒ నెం. 44లో పొందుపర్చిన మార్గదర్శకాలను ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయరంగంలో ఉన్న 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 2,61,240 కిలోమీటర్ల యల్టీ లైన్లు మషడో డిస్కం పరిధిలోకి రానున్నాయి. వీటి విలువలను 4,929 కోట్లుగా లెక్క కట్టారు. ఎస్‌పిడిపిఎల్ పరిధిలోని 2,92,061 ఎస్‌పిడిసిఎల్ పరిధిలోని 2,30,418 ట్రాన్స్‌ఫార్మర్లు మషడో డిస్కంకు బదలాయించి వాటికి స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. మీటర్లు బిగించడానికి రూ. 1,306 కోట్లను ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా మషడో డిస్కం విద్యుత్తు అవసరాలను రాష్ట్ర విద్యుత్తు సగటు వినియోగంలో 42%గా లెక్క తేల్చినారు. ఏడాదికి సుమారు 31,355 మిలియన్ యూనిట్లు అన్నమాట. అదే సమయంలో 660 మంది ఇంజనీర్లను, 1000 మంది సిబ్బంది, కార్మికులను కేటాయించారు. 340 మంది మిగతా సిబ్బంది ఇందుకు అదనం. ప్రస్తుతమున్న హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 28,773 మంది, వరంగల్ కేంద్రంగాయున్న ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 19,308 మంది మొత్తంగా రెండు డిస్కంలలో కలిపి 48,081 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరి 5 లక్షల 22 వేల 479 ట్రాన్స్‌ఫార్మర్లు, రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 42% ఉండబోతున్న మషడో డిస్కంను కేవలం రెండు వేల మంది ఇంజనీర్లు, సిబ్బందితో ఎలా నెట్టుకురాగలరు? క్షేత్రస్థాయి సిబ్బందిని 1000 మందిగా భావిస్తున్నారు.

ఆరువందల మండలాలకు విస్తరించియున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయరంగానికి సేవలందించడానికి కేవలం వేయి మంది ఎలా సరిపోతారు? ట్రాన్స్‌ఫార్మర్లు, యల్టీ లైన్లు మట్టుకే మషడో డిస్కం పరిధిలోకి వస్తాయి. 11 కెవి ఫీడర్లు, 33 కెవి లైన్లు, సబ్ స్టేషన్లు ప్రస్తుతమున్న డిస్కం పరిధిలోనే ఉండిపోతాయి. బ్రేక్‌డౌన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పు్పడు, అంతరాయాలు ఏర్పడినప్పు్పడు రెండు డిస్కంల ఉద్యోగుల మధ్య సమన్వయం ఎలా సాధ్యం? ప్రమాదాలు పెరిపోతాయి. ఇప్పటికే వ్యవసాయరంగంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పు్పడు మార్చడమనేది తలకు మించిన భారంగా తయారయ్యింది. ఈ విషయంలో అనేకమార్లు రెగ్యులేటరీ కమిషన్ జోక్యం చేసుకొన్ని స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు ఇవాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు మండలానికి అంటే ముప్పై నలభై గ్రామాలకు ఇద్దరు వ్యక్తులు ఉండి రైతులకు సేవలందించడం సాధ్యమయ్యే పనేనా? 5,22,479 ట్రాన్స్‌ఫార్మర్లు వేయి మంది సిబ్బంది అంటే సుమారు 523 ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్క మనిషి ఉంటాడన్నమాట.

ప్రస్తుతం ప్రతీ మండలానికి ఒక ఎఇ స్థాయి అధికారి ఉన్నాడు. దానిని మార్చి తాలూకా నియోజకవర్గ కేంద్రానికి ఒక ఎఇ ఉండబోతున్నాడు. అంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉంటే రైతు మండల కేంద్రానికి కాకుండా తాలుకా కేంద్రానికి వెళ్లాలన్న మాట. కొత్తగా కనెక్షన్ అవసరమున్న రైతులు దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి? ఎవరికి చేసుకోవాలి? ప్రతీ సబ్ డివిజన్ కేంద్రంగా ప్రస్తుతం కస్టమర్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. మరి మషడో డిస్కం ఎలాంటి ఏర్పాటు చేయబోతుంది? ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరింగ్ సెంటర్లు కూడా ఇంచుమించు ప్రతీ తాలుకా కేంద్రంలో ఏర్పాటై ఉన్నాయి. మెటీరియల్స్ అందించే స్టోర్స్ కూడా ఉమ్మడి లేదా కొన్నిచోట్ల విభజిత జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. మరి మషడో డిస్కం పార్లెల్గా కస్టమర్ సర్వీస్ సెంటర్, ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరింగ్ సెంటర్, జిల్లా స్టోర్ట్ ఏర్పాటు చేసుకుంటుందా? లేక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అన్న విష యం సందిగ్ధంగా ఉంది.

రాష్ట్ర విభజన అనంతరం పెన్షన్స్, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలోనే ఉండిపోవడం జరిగింది. ఇవన్నీ కలగలిపి మషడో డిస్కం ఏర్పాటుతో ఉద్యోగుల భవిష్యత్తు మరింత గందరగోళంగా తయారయ్యే అవకాశముంది. ఇప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రాలలో సహా క్రాస్ సబ్సిడీ విధానం ఇంకా కొనసాగుతున్నది. ప్రతిపాదిత మషడో డిస్కం ఆచరణలోకి వచ్చిన పక్షంలో వ్యవసాయ కనెక్షన్లకు ఎలాంటి రాయితీ అందించడానికి వీలుపడకపోవచ్చు. ఎందుకంటే ఒక కంపెనీ నుండి క్రాస్ సబ్సిడీని మరొక్క కంపెనీకి బదలాయించడం కుదరదు. భారతదేశ చరిత్రలోనే క్రాస్ సబ్సిడీని ఎత్తివేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కానున్నదా? మషడో డిస్కం ఏర్పాటు వలన రాష్ట్ర ప్రభుత్వానికి, రైతాంగానికి అదనపు కోలుకోలేని ఆర్థిక భారం పడనున్నది. డిస్కంల మధ్య సమన్వయలోపం, వనరుల లేమి వలన వ్యవసాయ వినియోగదారుల పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

- తుల్జారాం

సింగ్ ఠాకూర్ 78930 05313