
హైదరాబాద్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, మానవత్వమే మహోన్నత సేవ అనే భావనతో నిరంతరం సేవలందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లకు “ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాధలో ఉన్న ప్రతి మనిషికి ఆశాకిరణంగా నిలుస్తూ, మానవత్వపు విలువలను సజీవంగా కాపాడుతున్న రెడ్ క్రాస్ సేవకుల అవిశ్రాంత కృషి అనిర్వచనీయమని ప్రశంసించారు. మానవ సేవనే పరమ ధర్మంగా భావించి ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవకుల త్యాగం, నిబద్ధత సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో కరుణ, సంఘీభావం, సేవాభావం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెబుతున్న రెడ్ క్రాస్ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. మానవతా విలువలను మరింత బలోపేతం చేసే ఈ సేవా స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.