← Back to headlines

12న అసోంలో కొత్త ప్రభుత్వం

2026-05-07 17:00 • original

బిజెపి సారధ్య ఎన్‌డిఎ మరోమారు విజయం సాధించిన అసోంలో నూతన ప్రభుత్వం ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోట గురువారం ఈ విషయం తెలిపారు. ఈశాన్య కీలక రాష్ట్రంలో అసోం విజయంతో బిజెపి శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. గువహతిలోని వెటర్నరీ ఫీల్డ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బిజెపి , ఎన్‌డిఎ నేతలు హాజరు కానున్నారు.ఇందుకు తగు ఏర్పాట్లు జోరందుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని ఇతర ప్రముఖులు వస్తున్నందున భద్రతా ఏర్పాట్ల కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.పూర్తి స్థాయి ప్రోటోకాల్స్, నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది.

అన్ని సంబంధిత విభాగాలను ఇందుకు సంసిద్ధం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ సారధ్యంలోనే బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. అధికార పక్ష వ్యతిరేక పవనాలు వంటివి ఏమీ లేకుండా , ఇక్కడ బిజెపి తిరిగి రావడంతో జాతీయ స్థాయిలో అసోం ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పద్దతి ప్రకారం సిఎం గురువారం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తమ రాజీనామా సమర్పించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు వరకూ ఆయననే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా శాసనసభా పక్ష నేత ఎంపిక జరుగుతుంది. బిజెపి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు జెపి నడ్డా, నయిబ్ సింగ్ సైనీలను నియమించారు. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్‌డిఎ ఈసారి 102 స్థానాలను పొందింది. ఇక్కడ బిజెపి వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన ఘనతను చాటుకుంది.