
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన ఉంటుందా? టివి డిబేట్ చర్చకు వెళ్లినపుడు, మాడరేటర్ నన్నడిగిన ఈ ప్రశ్న సహజంగానే రాజకీయ వర్గాల్లో తిరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ప్రభావం ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు గాను పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాలనే మార్చింది. అంటే, అది ప్రజా వ్యతిరేకత వల్ల సహజ పరిణామంగా జరిగిందా? వేర్వేరు ప్రభావాలు దానికి తోడయ్యాయా? అన్నది గమనించాలి. ఒక్కో చోట ఒక్కో పరిస్థితి కళ్లకు కట్టింది! పాలక పక్షాలను దించేసిన ప్రభుత్వ వ్యతిరేకత మూడు చోట్ల కామన్‌గా ఉన్నా, మూడు భిన్నమైన పార్టీలు/ కూటములకు ప్రజలు పట్టం కట్టారు. వేర్వేరు అంశాలు అందుకు కారణమయ్యాయి. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ (టిఎంసి)ని దించేసిన బెంగాల్‌లో బిజెపి తొలిసారి అధికారంలోకి వస్తే, వరుస రెండు దఫాలు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కూటమిని దించి, కేరళలో సంప్రదాయంగా గెలిచే ప్రత్యామ్నాయ కూటమి (యుడిఎఫ్) మళ్లీ అధికారంలోకి వచ్చింది.
తమిళనాట దశాబ్దాలుగా ప్రత్యర్థులైన ద్రవిడ పార్టీల నేతృత్వంలోని పాలక డిఎంకె కూటమి, విపక్ష ఎఐఎడిఎంకె కూటమిని కాదని ప్రజలు సినీ కెరటంలా వచ్చిన హీరో విజయ్ కొత్తపార్టీ టివికెకు పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ సాధించిన ఫలితాల ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది. 2014 లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరుసగా దాదాపు పదేళ్లు బిఆర్‌ఎస్ (అంతకు ముందు టిఆర్‌ఎస్) పాలిస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే! ఆ వెంటనే జరిగిన లోక్‌సభ (2024) ఎన్నికల్లో బిజెపి 8/17 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్‌కు ఒక సీటు కూడా రాలేదు. తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ తన స్థానాలను బిఆర్‌ఎస్ కోల్పోయింది. ఇపుడు పుంజుకునే ప్రయాసలో ఉంది. ఈ పరిస్థితుల్లోనే, మరో రెండున్నర సంవత్సరాలకు జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బిజెపి లక్ష్యం. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి తాజా అయిదు రాష్ట్రాల అసెంబ్లీల ఫలితాలు బిజెపికి ఒక బూస్టింగ్!
కొత్త టాస్క్, టానిక్ ఇస్తారా?
పంథా, పద్ధతులపై విమర్శలెలా ఉన్నా.. దేశంలో అప్రతిహతంగా విస్తరిస్తున్న బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణగా కనిపిస్తోంది. పార్టీ నాయకులు కొంతమంది ఆ మాట నేరుగా అంటున్నా అందుకు అధినాయకత్వ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అన్నదే ఆసక్తికరం! ముఖ్యంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల తాజా ఫలితాల తర్వాత పార్టీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కొరకరాని కొయ్యలా ఉన్న దీదీ మమతా బెనర్జీనే దించేసి, పశ్చిమ బెంగాల్‌నే కమ్మేసిన తర్వాత సానుకూలంగా ఉన్న తెలంగాణలో ఇంకా వైఫల్యమెందుకు? అన్నది బిజెపి అగ్రనాయకత్వపు ప్రశ్న. రాష్ట్ర నాయకత్వం పనితీరు మీద ఢిల్లీ నాయకత్వానికి పెద్దగా సంతృప్తి లేదనేది పలుమార్లు వెల్లడయింది. పార్టీ అంతర్గత భేటీలో అగ్రనేత ఇటీవల చేసిన తాజా వ్యాఖ్య అందుకు నిలువెత్తు నిదర్శనం. ‘మీలో ఎంత మంది, ఎంత కాలం పాటు పార్టీలో ఉంటారో..? ఉన్నంత కాలమైనా కలిసికట్టుగా, ఐక్యంగా ఉండండి!’ అని కాస్త కఠువు, బెదిరింపు మేళవించిన స్వరంతో అన్నారంటే పరిస్థితి తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘మేమంతా ఐక్యంగానే ఉన్నాం, మాలో ఏ విభేదాలు లేవు’ అని ఉమ్మడిగా, బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయలేనంత విభేదాలు పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య ఉన్నాయి. ముఖ్యుల్లో ఒకరంటే మరొకరికి గిట్టదు. పాత తరం నాయకులకు కొత్తగా పార్టీలోకి వచ్చి స్థిరపడాలనుకుంటున్న నాయకులకి మధ్య స్పర్ద బహిరంగ రహస్యమే! హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో మూడో వంతు స్థానాలు గెలిచి కొత్త ఆశలు రేపినా.. ప్రజాభిమానం చూరగొన్నది లేదు, పార్టీ బలోపేతం కాలేదు. లోక్‌సభ సీట్లు లభిస్తున్నా రాష్ట్రమంతటా సంస్థాగతంగా పార్టీ బలపడటం లేదనే భావన ఉంది. ఉత్తర తెలంగాణలో క్రమంగా బలపడుతున్నా ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఎదగడం లేదు. ఈ విషయాల్లో అధినాయకత్వం కొత్తగా ఏం టాస్క్ ఇస్తుంది? లోగడ ప్రచారం జరిగినట్టు ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు ఎవరినైనా బిజెపిలోకి లాగుతుందా? పాత- కొత్త మధ్య సయోధ్య కుదురుస్తుందా? ఇవన్నీ ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
మునివేళ్లపై నిలవాల్సిందే..
బిజెపి జోరు పెంచితే మొదట అప్రమత్తమై, సన్నద్ధం కావాల్సింది బిఆర్‌ఎస్ పార్టీయే! తిరిగి అధికారంలోకి రావాలంటే పూర్తిస్థాయిలో, ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే తప్ప ఫలితాలు సాధించడం కష్టం. తమిళనాడు ఫలితం నుంచి పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. 2016లో అనూహ్యంగా, సంప్రదాయంగా వస్తున్న ప్రత్యామ్నాయ ఎంపికకు భిన్నంగా జయలలిత నేతృత్వంలోని ఎఐఎడిఎంకె అధికారం నిలబెట్టుకుంది. 1984లో ఎంజి రామచంద్రన్ తర్వాత అది రికార్డు. 2016 చివర్లో జయలలిత మరణం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఎఐఎడిఎంకె పార్టీ/కూటమి గెలువలేదు. పార్టీగా బలహీనపడుతూ వచ్చింది. నిన్నటి ఎన్నికల్లో సిఎం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె కూటమిని ప్రజలు వ్యతిరేకించినా విపక్ష ఎఐఎడిఎంకె -బిజెపి కూటమిని ఎంచుకోలేదు. కొత్త శక్తిగా వచ్చి, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన సినీతార విజయ్ పార్టీ టివికెకు పట్టం కట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంపూర్ణ మెజారిటీ దక్కకపోయినా ఇపుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. ‘రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు, పదేళ్లు వాళ్లను, అయిదేళ్లు వీళ్లను చూశారు, మోసపోయారు. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, కేంద్రంలో -రాష్ట్రంలో మేమే ఉంటాం, ‘డబుల్ ఇంజన్ సర్కార్’తో అభివృద్ది, తెలంగాణ ఆకాంక్షలు తీరుతాయి’ అనే ప్రచారంతో బిజెపి విస్తరిస్తే అది రాజకీయంగా బిఆర్‌ఎస్‌కు సంకట పరిస్థితే! పదేళ్ల అధికారం తర్వాత 2023 లో ఓటమి ఎదురై, 39 స్థానాలతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా లభించినా ఆ స్థాయిలో పనిచేయటం లేదనే విమర్శ ఉంది. ‘అసెంబ్లీకే రాని విపక్షనేతకు జీతం ఎందుకు?’ అని సిఎం ప్రశ్నిస్తున్నారు. పది మంది పార్టీ మారిన ఎంఎల్‌ఎలు ‘సాంకేతికంగా’నే పార్టీ తో ఉన్నారు. 2024 లోక్‌సభ, తర్వాతి సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నదగిన ఫలితాలు రాలేదు. స్థానిక నాయకత్వం పోరు- పట్టుదల కారణంగానే ఆ మాత్రం స్థానాలయినా దక్కాయనే భావన జనంలో ఉంది. పార్టీకి దూరమైన కవిత పలు విషయాల్లో బిఆర్‌ఎస్ నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కెసిఆర్ తనయుడు కెటిఆర్ సానుకూలత కోసం పార్టీ మరో ముఖ్యనాయకుడు హరీశ్‌రావుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే భావన పార్టీ శ్రేణుల్లో, బయటా బలంగా ఉంది. ఆ భావన హరీశ్‌రావుకు కూడా కలిగితే, కలిగి- పెరిగితే... పార్టీకి ప్రమాదమే!
పాలకపక్షానికీ పాఠం ఉంది
ఎన్ని కథనాలు (న్యారెటివ్స్) వినిపించినా, మరెన్ని వ్యూహాలు రచించినా ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా పాలిస్తే గద్దె దింపడానికి వారు సిద్ధంగా ఉంటారనే పాఠం తెలంగాణలో పాలక కాంగ్రెస్ నేర్చుకోవాల్సి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిలబడ్డ పుదుచ్చెరి, అసోం లను మినహాయిస్తే మిగతా మూడు, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లోనూ ప్రజలు చెప్పిన పాఠమదే! షీలా దీక్షిత్ (ఢిల్లీ), డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి (ఉమ్మడి ఎపి). తరుణ్ గగోయ్ (అసోం) ల తర్వాత మరే కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మరోమారు ఎన్నిక కాలేదు. మారుతున్న ఎన్నికల సరళి, జనం ఆలోచనా విధానాల్ని బట్టి ప్రభుత్వాలు బాధ్యతగా, ప్రజా విశ్వాసం చూరగొంటూ పాలించాల్సిన తెలివిడిని అలవరచుకుంటేనే మళ్లీ గెలిచే మార్గం!.
దిలీప్‌రెడ్డి