← Back to headlines

విపక్షమే విస్తుపోవాలి

2026-05-06 23:00 • original

మన తెలంగాణ/హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10న బిజెపి నిర్వహించే బహిరంగ సభ ఆ పార్టీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నందున ఆ పార్టీ నేతలు జనసమీకరణపై దృష్టి సారించారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రధాని మోడీ ముందు పరువుపోవడమే కాకుండా ప్రతిపక్షాలూ సభ అట్టర్ ప్లాఫ్ అంటూ ధ్వజమెత్తుతాయన్న భయం పార్టీ నేతల్లో లేకపోలేదు. అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ ముఖ్యులతో, జిల్లా నాయకులు, మండల నాయకులతో మాట్లాడుతూ వారికి అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఆయన పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, డికె అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, అంజిరెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ తదితరులు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. రాబోయే మూడు రోజులు కష్టపడితే బయటపడతామని, బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా విపక్షాలు విస్తుపోయేలా చేయాలని,

రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందన్న సంకేతం పంపించాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎంపీల సమావేశంలో అన్నారు. జన సమీకరణ, ఏర్పాట్లు, ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా చూసుకోవడం, వేదికపై ఎంత మంది ఉండాలి ? తదితర అంశాలపై వారు చర్చించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో ప్రధాని మోడీ 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారని, వేదికపై సుమారు గంటన్నర పాటు ఉంటారని నేతలు అంచనా వేస్తున్నారు. ఆ రోజు ప్రధాని మోడీ బెంగళూరు నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హై-టెక్ సిటీలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. అయితే ప్రధాని మోడీ అధికారిక పర్యటన వివరాలను పిఎంవో ఇంకా విడుదల చేయలేదు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల కుటుంబ సభ్యులతో ప్రధానిని కలిసి తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీకి ప్రారంభోత్సవం చేయడానికి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని స్వయంగా వెళ్ళకుండా వర్చువల్ ద్వారానే ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

మూడోసారి మోడీ ప్రధానిగా ..

రాంచందర్ రావు చీఫ్ అయ్యాక..

ఈ బహిరంగ సభకు రెండు విశిష్టతలు ఉన్నాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పర్యటనకు రావడం ఒక విశిష్టత అయితే, రాంచందర్ రావు బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ప్రధాని మోడీ హాజరుకానుండడం రెండో విశిష్టత అని చెప్పవచ్చు.

సీఎంలే ఓటమిః ఈటల

ఇదిలాఉండగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారాన్ని వీడాలని అన్నారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన ఉదహరించారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూలైలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అప్పుడు లోక్‌సభ సీట్లు 453 నుంచి 816కి పెరుగుతాయని ఎంపీ రఘునందన్ రావు వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకే ఇటీవల జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమికి భారీగా దెబ్బ పడిందన్నారు.