
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: రైతులు పండించిన వరి, మక్కజొన్న పంట ఉత్పత్తులను రెండు రోజుల్లో చివరి గింజ వరకు కొనుగోళ్లు పూర్తి చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నుంచే రైతు ఉద్యమాలు బలోపేతం అవుతాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. రైతుల సమస్యల్ని తప్పించుకొని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా వదిలపెట్టం నా కొడకా.. కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో ఏర్పాటుచేసిన బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ భేరి సభకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి 2022 మే 6న ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో 39 హామీలిచ్చి గద్దెనెక్కారన్నారు.
ఆ హామీలన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. రైతులను మోసం చేసిన విధంగానే అన్ని వర్గాల ప్రజలను డిక్లరేషన్ల పేరు తో మోసం చేసి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ముఠా చెడ్డి గ్యాంగ్‌ను మించి రీతిలో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రంగానికి చెందిన ప్రజలు సంతృప్తికరంగా లేరన్నారు. వ్యవస్థలన్నీంటిని నిర్వీర్యం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన చేతగాక ఢిల్లీకి 69 సార్లు 69 పైసలు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. బడే భాయ్‌గా ప్రధాని మోడీ.. చోటే భాయ్‌గా రేవంత్‌రెడ్డి ప్రజల ముందు సంబంధాలను కలుపుకునుడే తప్పా వారిద్దరితో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గుదిబండగా మారిందన్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు అప్పులు మాత్రం పెరుగుతున్నాయని.. అభివృద్ధి పేరుతో తెస్తున్న అప్పులన్నీ వారి జేబుల్లోకి వెళ్తున్నాయే తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఎకరానికి సంవత్సరానికి రూ. 10 వేలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కినాకా రూ. 10 వేల రైతు బంధు ఇచ్చిన గతి లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిందని ఈ సమయంలో రైతులకు ఇంకా మూడు పంటలకు రావల్సిన రైతు బంధు బకాయి ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రైతు బీమా పథకాన్ని అటకెక్కించారన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 74 లక్షల మంది రైతుల్లో కేవలం 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మిగిలి 50 లక్షల రైతుల రుణమాఫీ ఎవరు చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రైతులకు గుదిబండగా ఈ ప్రభుత్వం తయారవుతుందన్నారు.
రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాల ముచ్చట పక్కన పెడితే ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారన్నారు. ఆ విద్యుత్ మీటర్ల విధానాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించిందని.. అదే విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బడే భాయి దోస్త్ అయిన ఆదాని కంపనీకి మీటర్ల బిగింపు కాంట్రాక్ట్ వస్తున్నందున ఇది ఆయనకు గిఫ్ట్‌గా ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర రైతాంగం అప్రమత్తంగా ఉండి ఆ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా పోరాడాల్సినవసరం ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక నమూనాగా అభివృద్ధి చేసుకుంటూ పోయారన్నారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. కాలిపోయిందని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరమ్మతులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులను పునర్ నిర్మాణం, మరమ్మతులు చేసినా నిల్వ చేసే నీటి సామర్థానికి ప్రాజెక్టులు కొట్టుకపోతాయని చెప్పిన కేంద్ర, రాష్ట్రాల సాంకేతిక నిపుణులు ఇప్పుడు ఏ పద్ధతిలో ప్రాజెక్టును రిపేర్ చేయడానికి పూనుకున్నారని ప్రశ్నించారు.
ఈ మూడు తీర్మానాలు అమలుచేయకుంటే రాష్ట్రం అగ్ని గుండమే
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ సభ నుంచి తాము తీర్మానం చేసిన మూడు డిమాండ్లను వెంటనే అమలుచేయకుంటే రైతుల ఆధ్వర్యంలో రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు హెచ్చరించారు. రైతు బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలని, మృతిచెందిన ప్రతీ రైతుకు రైతు బీమా పథకం అమలుచేయాలని, రూ.2 లక్షల రుణమాఫీ జరగని వారికి రుణమాఫీ వర్తింపచేయాలని, రైతులు పండించిన ధాన్యం, మక్కజొన్న పంట ఉత్పత్తులను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ రైతు సభ తీర్మాణం చేసిన ఈ డిమాండ్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేయకపోతే రైతు ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రం అగ్ని గుండంగా మారబోతుందని దానికి సీఎం రేవంత్‌రెడ్డే నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నర సంవత్సరాల విలువైన కాలాన్ని ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికే సరిపోయిందన్నారు.
రైతు సంగ్రామ సభ సక్సెస్
వరంగల్‌లో రైతుల సమస్యలపై ఏర్పాటుచేసిన రైతు సంగ్రామ సభ విజయవంతమైంది. వరంగల్ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అక్కడ నుంచే మొదలుపెట్టగా అదే స్థలంలో రైతు సంగ్రామ సభను ఏర్పాటు చేస్తామంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పటికీ హంటర్ రోడ్డులో ఈ సభ అనూహ్యంగా విజయవంతమైంది.