
మన తెలంగాణ / సిటీబ్యూరో / మాదన్నపేట్: అది దిల్‌సుక్‌నగర్ బస్టాప్... అర్థరాత్రి 12 గంటలు దాటుతోంది. ఓ ఒంటరి మహిళ బస్టాప్‌లో నిలబడి ఉంది. ఇంకేం.... ఆకతాయిలు ఒక్కొక్కరుగా ఆమె వద్దకు చేరి... ‘చాలా బాగున్నవ్ ఎవరికోసం ఎదురుచూస్తున్నావ్... వస్తావా...? రమ్మంటావా...? నీ రేటంత...? నువ్వు చెప్పు ఎంత ఇవ్వమంటవో...’ అంటూ వెకిలీ మాటలు. అసభ్య ప్రవర్తనలు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇలా 40మందికి పైగా పోకిరీలు. ఇందులో విద్యార్థులూ ఉన్నారు. అలా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3.30 గంటల వరకూ సుమారు మూడున్నర గంటల పాటు ఆమెపట్ల కొందరూ అసభ్య మాటలతో వెకిలీగా ప్రవర్తించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను బైక్‌లతో అడ్డుపడుతూ.. ఈ రాత్రికి వస్తావా..? అంటూ బేరాలు మొదలు పెట్టారు. అలా ఆకతాయిల వేధింపులను భరిస్తూ దాదాపు మూడున్నర గంటలు అక్కడే ఉన్నారు.
అనంతరం పోలీసులను పిలిపించి ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనెవరో చెప్పి ఆకతాయిలకు చెమటలు పట్టించారు. ఆమె మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి అని తెలియగానే పోకిరీల వెన్నులో వణుకు మొదలయ్యింది. 40 మందిని పోలీసుస్టేషన్‌కు తరలించి తనదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే సుమతి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ... స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించి అందరినుంచి ప్రశంసలు అందుకున్నారు. తానేంటో... తన పనితీరు ఏంటో... చూపించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా ఈనెల 1న బి. సుమతి బాధ్యతలు చేపట్టారు. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా పెట్టాలని... ఆకతాయిలు మహిళల జోలికి రావాలంటేనే జంకేవిధంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నగరవాసులు కోరుతున్నారు.