← Back to headlines

ప్రజాస్వామ్య విలువలపై దీదీ ‘ధిక్కార’ నీడ!

2026-05-08 04:45 • original

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, ‘నేను దిగిపోను.. చేతనైతే గవర్నరే నన్ను బర్తరఫ్ చేయాలి’ అని వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే దానికి శాసనసభలో మెజారిటీ ఉండాలి. అంతకంటే ముఖ్యంగా, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి ఎన్నికలద్వారా ప్రజల మద్దతును పొంది ఉండాలి. ‘ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలతీర్పును శిరసావహించడం నాయకుడి కనీస బాధ్యత. బర్తరఫ్ చేయమని కోరడంద్వారా మమతా బెనర్జీ రాజకీయ లబ్ధి కోసం ‘విక్టిమ్ కార్డ్’ (బాధితురాలిగా చూపించుకోవడం) ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి, కానీ ఈసారి మమతా బెనర్జీ వైఖరి రాజ్యాంగ పరిమితులను దాటినట్లు కనిపిస్తోంది. పదవి కంటే ప్రజాస్వామ్య విలువలు గొప్పవని గుర్తించాల్సిన బాధ్యత ఒక ప్రజానాయకురాలిగా ఆమెపై ఉంది. ధిక్కార స్వరం వినిపించడం తాత్కాలికంగా రాజకీయంగా కలిసి రావచ్చు ఏమో కానీ, చరిత్రలో అది ఒక ‘కళంకం’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా దుస్తులు పంపించే దీదీ మమతా బెనర్జీ.. రాజకీయంగా మోడీని విభేదించడం ఎవరికైనా ఆశ్చర్యం కలగపోవచ్చు. కానీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె ఇటువంటి ప్రజాస్వామ్య ధిక్కార స్వరాన్ని వినిపించడం నిజంగా ఆశ్చర్యకమే!

భారత రాజకీయ చరిత్రలో మహిళల పాత్ర క్రమంగా విస్తరించుకుంటూ వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న మహిళలు ఇప్పటికీ అరుదుగానే కనిపిస్తారు. అయినా, తమ నాయకత్వంతో కొన్ని రాష్ట్రాల రాజకీయ దిశను ప్రభావితం చేసిన కొంతమంది మహిళా ముఖ్యమంత్రులు భారత ప్రజాస్వామ్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. మరికొంత మంది అవినీతి పంకిలంలో కూరుకుపోయారు. వారి విజయాలు, వైఫల్యాలు గమనార్హమే! స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు సుమారు 17 మంది మహిళలు వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. వీరిలో కొందరు సుదీర్ఘకాలం పాలించి రికార్డులు సృష్టించగా, మరికొందరు స్వల్ప కాలానికే పరిమితమయ్యారు.

భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా నిలిచింది సుచేతా కృప్లాని.1963లో ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మహిళా నాయకత్వానికి బాటలు వేసింది. పరిపాలనలో క్రమశిక్షణను తీసుకురావడంలో ఆమె పాత్ర ప్రశంసనీయం. తర్వాతి కాలంలో జయలలిత తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకురాలిగా ఎదిగారు. ఆరుసార్లు సిఎంగా సేవలందించి అమ్మగా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.అక్రమాస్తుల కేసుల్లో జైలుశిక్ష అనుభవించడం ఆమె రాజకీయ జీవితంపై మచ్చ వేసాయి.

ఇదే సమయంలో మాయావతి దళిత రాజకీయాలకు కొత్త దిశను చూపించారు. నాలుగు సార్లు సిఎంగా పనిచేసిన మాయావతి సామాజిక న్యాయం కోసం కృషి చేసినప్పటికీ, విగ్రహాల నిర్మాణం, ఖర్చులపై విమర్శలు ఎదుర్కొన్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి చరిత్ర సృష్టించించారు. ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందిన ఆమెపై కూడా రాజకీయ హింస, పరిపాలనా లోపాలపై విమర్శలు ఉన్నాయి. శారదా చిట్ ఫండ్ వంటి కుంభకోణాలు, ఇటీవల ఆర్.జి కర్ హాస్పిటల్ ఘటన వంటి పరిణామాలు ఆమె పాలనకు అడ్డుకట్టవేశాయి.

దేశంలో అత్యధిక కాలం సుమారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ షీలాదీక్షిత్ ఢిల్లీ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మౌలిక సదుపాయాల విస్తరణలో ఆమె కృషి గుర్తింపు పొందినా, అవినీతి ఆరోపణలు ఆమె పాలనపై ప్రభావం చూపాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, అంతర్గత పార్టీ విభేదాలు, ప్రజా అసంతృప్తి ఆమెకు సవాళ్లుగా మారాయి. గుజరాత్‌లో ఆనంది బెన్ పటేల్ గుజరాత్‌లో పరిపాలన కొనసాగించినప్పటికీ, పటిదార్ ఆందోళనలు ఆమె పదవీ కాలాన్ని కుదించారు. మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే భద్రతా సమస్యలు, రాజకీయ అస్థిరత ఆమె పాలనను ప్రభావితం చేశాయి. బీహార్‌లో రబ్రీ దేవి రాజకీయ నేపథ్యం లేకపోయినా 7ఏళ్ల పాటు సిఎంగా ఉన్నారు. ఆమె ఎల్లకాలం భర్త చాటు సిఎంగానే మిగిలిపోయారు

ఇతర ముఖ్యమైన మహిళా సిఎంల ప్రస్థావనలో ఢిల్లీ సిఎంగా 52 రోజులు మాత్రమే పనిచేసిన సుష్మా స్వరాజ్. ఢిల్లీ ముఖ్యమంత్రుల్లో ప్రస్తుతం ఉన్న రేఖా గుప్తా గత ఏడాది ఫిబ్రవరి 20 బాధ్యతలు స్వీకరించి కనీసం మంత్రి పదవి కూడా గతంలో నిర్వహించని నేపథ్యంతో ఏకంగా సిఎం సీటును అధిష్టించారు. ఢిల్లీ పీఠంపై ప్రస్తుతం రేఖ గుప్తా, అంతకుముందు అతిషి (ఆప్) ఢిల్లీ రాజకీయాల్లో కొత్త తరం మహిళా నాయకత్వానికి ప్రతినిధులుగా నిలుస్తున్నారు. భారతదేశ మహిళా ముఖ్యమంత్రుల చరిత్రను పరిశీలిస్తే కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి, చాలామంది మహిళా నేతలు ప్రత్యర్థుల కుట్రల వల్లనో లేదా అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్లనో అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. వీటన్నింటికీ భిన్నంగా ఇప్పుడు మమత బెనర్జీ తన ఓటమిని అంగీకరించకుండా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, కేంద్రంలోని బిజేపీని తిట్టిపోయడం ద్వారా అసహనాన్ని బయటపెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్ధకు ప్రమాదకరం!

- దిమిలి అచ్యుతరావు

93951 50036