← Back to headlines

బెంగాల్ కొత్త ఎమ్మెల్యేల్లో 65 శాతం మందిపై క్రిమినల్ కేసులు..

2026-05-06 16:04 • original

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్‌ఎల్‌ఎలలో 65 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా ప్రకటించుకున్నారు. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి 49 శాతం కంటే గణనీయంగా పెరిగింది. ఈమేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం గెలిచిన 292 మంది అభ్యర్థుల్లో 190 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 170 మంది (58 శాతం) ఎమ్‌ఎల్‌ఎలు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

14 మంది ఎమ్‌ఎల్‌ఎలపై హత్య కేసులు, 54 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.63 మంది విజేతలు మహిళలకు సంబంధించిన కేసులను ప్రకటించారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీ అభ్యర్థుల్లో 74 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.తృణమూల్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల్లో 80 మందిలో 34 మంది (43 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంతో పోలిస్తే 2021లో 49 శాతంగా ఉన్న క్రిమినల్ కేసులు కలిగిన ఎమ్‌ఎల్‌ఎల సంఖ్య 2026 నాటికి 65 శాతానికి చేరింది. 2021లో 113 మంది (39 శాతం) తీవ్రమైన కేసులు ఎదుర్కోగా, ఇప్పుడు ఆ సంఖ్య 170 కి పెరిగింది. ఇక, నివేదిక ప్రకారం 61 శాతం మంది ఎమ్‌ఎల్‌ఎలు కోటీశ్వరులు కాగా, ఇది 2021 నాటి 54 శాతం కంటే ఎక్కువ.