
రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి భరోసానిచ్చింది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేద ప్రజల చెంతకు చేర్చేలా చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటి సిఎం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న
, జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటి సిఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాధారణంగా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తుందని, దీన్ని అదునుగా తీసుకుని మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడుతుంటారని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి నేరుగా ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు డిప్యూటి సిఎం తెలిపారు. ధాన్యం కేవలం మార్కెట్ సరుకుగా మిగిలిపోకూడదని అది పేదవాడి ఆకలి తీర్చే పౌష్టికాహారంగా మారాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.
గురుకులాలు, హాస్టళ్లకు పౌష్టికాహారం
ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాకుండా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని డిప్యూటి సిఎం తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా మొక్కజొన్న, జొన్నల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ట్రీ రైతులకు అవసరమైన మేరకు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు.