← Back to headlines

ఇజ్రాయెల్‌లో తెలంగాణ యువతకు 1,200 ఉద్యోగాలు

2026-05-06 14:35 • original

 ఇజ్రాయెల్‌లో రీనోవేషన్ రంగంలో నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో చర్చలు జరిపారు. కార్మిక, ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని టామ్‌కామ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ యువతకు, నిర్మాణ కార్మికులకు ఇజ్రాయెల్‌లోని రీనోవేషన్ రంగంలో నియమించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (ఎన్‌ఎస్‌డిసిఐ), పాప్యులేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ ఆఫ్ ఇజ్రాయెల్ (పిఐబిఎ)లతో భాగస్వామ్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం రీనోవేషన్ రంగంలో 1,200 మంది కార్మికుల అవసరాన్ని వ్యక్తం చేసింది.

ఎన్‌ఎస్‌డిసిఐ, పిఐబిఎ సమన్వయంతో అభ్యర్థులకు సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, బ్లాక్ మేసన్, డ్రై వాల్ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. 2025 నవంబర్ 17 నుంచి 19 వరకు నిర్వహించిన ప్రీ-స్కిల్ అంచనా పరీక్షలో మొత్తం 4,247 మంది అభ్యర్థులు పాల్గొనగా, అందులో 2,059 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం తుది దశలో ఎంపికైన 1,200 మంది అభ్యర్థులకు మే 5 నుంచి 10 వరకు ఫైనల్ స్కిల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రతినిధులు, మంత్రి, కార్మిక శాఖ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపి, నైపుణ్య యువతకు ఉన్న అవకాశాలు, భవిష్యత్తులో ఈ సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్‌కామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.