← Back to headlines

అకాల వర్షానికి నలుగురు రైతులు బలి

2026-05-06 14:31 • original

అకాల వర్షానికి పంటను కాపాడేందుకు వెళ్లి రేకుల షెడ్డు మీద పడటంతో నలుగురు రైతులు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు ఈదురు గాలులతో పెద్ద ఎత్తున వర్షం ప్రారంభమైంది. దీనితో కొనుగోలు కేంద్రాలలో, కల్లాలలో ఉన్న వడ్లకు తాటిపత్రిలు కప్పడానికి వెళ్లిన రైతులు మరణం పొందారు. కంపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల అభిరామ్ తణుకుల నాగరాజులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వర్షం పెద్ద ఎత్తున రావడంతో దగ్గరలో ఉన్న రేకుల షెడ్డు పక్కన గోడకు ఆనుకొని నిలబడ్డారు. దీనితో వర్షం పెద్ద ఎత్తున రావడం గాలి దుమారం లేవడంతో గోడ కూలింది. వీరిద్దరు కాకుండా కొత్తూరు కు చెందిన గుండారపు వెంకటేష్ ఇదే పనిపై వెళ్లి అదే గోడ పక్కన నిలబడ్డారు. దీనితో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్కి లచ్చన్న విషాదం మరో విధంగా ఉంది.

దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న తన కుమారుడిని హైదరాబాద్ బస్సుకు లక్షెట్టిపేటలో ఎక్కించి తిరిగి వస్తుండగా ఇక్కడ చాలామంది ఉన్నారు కదా తాను కూడా నిలబడతానంటూ నిలబడ్డాడు. ఆ ఇద్దరితో పాటు నెల్కి లచ్చన్న కూడా మృతి చెందాడు. ఈ నలుగురు మృతితో మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దీనితో కోపోద్రిక్తులైన రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు దిగడంతో మండలంలో రవాణా ఆగిపోయింది. రైతుల మృతి ప్రభుత్వ తప్పిదం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వం లెక్కలేనితనంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంచడం కొనుగోలు చేయకపోవడం తరలించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని దక్కించుకోవడం కోసం రాత్రి కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మరణం పొందడం తీవ్ర విషాదం అని ఈ సందర్భంగా విమర్శించారు. ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్ కుమార్ ల ఆధ్వర్యంలో స్థానిక ఊత్కూరు చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.

సుమారు 9 గంటలు రాస్తారోకో నిర్వహించడంతో రెండు వైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనారోగ్య కారణాల వలన ఫంక్షన్లో పెళ్లిళ్ల వలన ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉండడంతో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి రైతు కుటుంబాలకు న్యాయం చేయకపోతే పోరాటం పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు. తొమ్మిది గంటలు రాస్తారోకో చేసిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనితనం కనబడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే సీఎంఆర్‌ఎఫ్ కింద 50 లక్షలు ఒక్కో రైతుకు ఇవ్వడం పెద్ద విషయం కాదని ఇస్తామని మాట ఇస్తే తప్ప రాస్తారోకోను ఆపేది లేదన్నారు.

సాయంత్రం 5:30 గంటలకు ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో డీసీపీ ప్రకాష్, అసిస్టెంట్ కలెక్టర్ రెవెన్యూ రాములు ఊట్కూరు చౌరస్తాకు చేరుకొని జీవన్ రెడ్డి, నాయకులను మెప్పించి రాస్తారోకో విరమింప చేశారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బీమా, ఐదు లక్షలు రూపాయలు కాకుండా 50 లక్షల రూపాయలు సీఎంఆర్‌ఎఫ్ నిధులనుండి రికమండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో టిఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో ఆపేశారు.