← Back to headlines

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కెటిఆర్ క్షమాపణ చెప్పాలి

2026-05-06 13:26 • original

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం కెటిఆర్ దురహంకారానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. దొర ధోరణితో కెటిఆర్ అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బిఆర్‌ఎస్ పాలనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మడికట్లలో, నాగేటి సాళ్లలో బిఆర్‌ఎస్ పాలనను రైతులు పాతరేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం తగ్గకపోవడం దురదృష్టకరమన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, వడ్డీలకే సరిపోని విధంగా నాలుగు విడతల పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశారని సీతక్క తెలిపారు. నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారిని పూర్తిగా రుణ విముక్తులను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంతో, బాధిత కుటుంబాలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మానవత్వంతో ముందుకు వచ్చి, గతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా పరిహారం అందించి భరోసా కల్పించిందని తెలిపారు. పంటకు బోనస్ ఇస్తామని కెసిఆర్ ఇచ్చిన హామీని 10 సంవత్సరాల పాటు నెరవేర్చలేదని, కాని ప్రస్తుత ప్రభుత్వం రైతు కష్టానికి గౌరవం ఇస్తూ పంటలకు బోనస్ అందిస్తోందని మంత్రి వివరించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేసిందని, కొన్ని సీజన్లలో 5 నుంచి 6 నెలల వరకు ఆలస్యం జరిగిందని తెలిపారు. 2018 యాసంగిలో 161 రోజులు, 2022 -23 యాసంగిలో 148 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత వానాకాలంలో కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని పేర్కొన్నారు.


ఫామ్‌హౌస్ పాలనలో భూస్వాములు, వ్యాపారుల ప్రయోజనాలకే బిఆర్‌ఎస్ పనిచేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కర్షకుల కోసం, పొలాల్లో కష్టపడే రైతుల కోసం కట్టుబడి పనిచేస్తోందని సీతక్క స్పష్టం చేశారు. తాము ఫామ్ హౌస్‌లో, ఫారిన్ టూర్లలో కాలయాపన చేయడం లేదని, నాడు నేడు రైతుల వెంటే ఉన్నామని, నిత్యం ప్రజల్లో తిరుగుతున్నామని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిని ఓర్వలేక కెటిఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కెటిఆర్‌కు లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్ల అప్పటి మున్సిపల్ చైర్‌పర్సన్ పావని కమిషన్లు లేనిది పనులు కావడం లేదని చేసిన ఆరోపణలు ప్రజలకు తెలిసిందేనని గుర్తుచేశారు. ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి సీతక్క హెచ్చరించారు.