
పంజాబ్ కింగ్స్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) మాజీ ప్లేయర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయస్సులోనే గిల్ తుదిశ్వాస విడిచారు. అండర్-19 జట్టుతో టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి గిల్ ఆడారు. చంఢీగఢ్‌లో జన్మించిన గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపిఎల్ ప్రారంభ దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
2007లో అండర్-19 ప్రపంచకప్‌లో అమన్‌ప్రీత్ విరాట్‌తో కలిసి పాల్గొన్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆయన మొత్తంగా 9 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అమన్‌ప్రీత్ గిల్ మృతికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ‘‘పంజాబ్ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరమని’’ సోషల్‌మీడియా ద్వారా పేర్కొంది. ఇక మే 6న ఛండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశానవాటికలో అమన్‌ప్రీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించే అవకాశం ఉంది.